YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చీరాల స్థానంలో పాలేటికి ఛాన్స్

చీరాల స్థానంలో పాలేటికి ఛాన్స్

ఏపీలో ఎన్నికల వేడి మరింతగా రాజుకుంటోంది. టిక్కెట్లు ఆశించేవారి సంఖ్య అన్ని పార్టీలలోనూ పెరిగిపోతున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం టిక్కెట్ మాజీ మంత్రి పాలేటి రామారావుకు దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 1994,1999లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన పాలేటి ఆ తరువాత టిడిపికి దూరమయ్యారు. తిరిగి 2009లో ప్రజారాజ్యం అభ్యర్థికి మద్దతు పలికారు అటుపిమ్మట రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. కాగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణునికి ప్రియశిష్యునిగా పాలేటి పేరుగాంచారు. దీనికితోడు యాదవ సామాజికవర్గానికి చెందిన పాలేటికి చీరాల టిక్కెట్ ఇస్తే ఆ ప్రభావం ఆ పక్కనే ఉన్న బాపట్లకు కూడా కలిసివస్తుందని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా 2014 లో పాలేటికి టిక్కెట్ ఇద్దామని చంద్రబాబు భావించినా, ఆఖరి నిమిషంలో అవకాశం చేజారిందని తెలుస్తోంది. అప్పట్లో టీడీపీ నేత పోతుల సురేష్‌ ఒత్తిడి మేరకు పోతుల సునీతకు టిక్కెట్‌ కేటాయించారు. అయితే ఆమె ఆ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. మరోవైపు పాలేటిని ఎన్నికల బరిలో దించాలనే ఉద్దేశంతోనే పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అయితే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ పాలేటికి టిక్కెట్‌ ఇవ్వాలని చంద్రబాబు ముందు యనమల పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని భోగట్టా. మరోవైపు చీరాల నియోజకవర్గం నుంచి గతంలో ఆమంచి కృష్ణమోహన్‌కు ఇండిపెండెంట్‌గా గెలిచారు. తాజాగా ఆయన టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారని సమాచారం. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఆమంచికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించేది లేదని బీసీ నాయకులు బాహాటంగా చెబుతున్నారని సమాచారం. దీనికితోడు తమ నాయకుడు పాలేటిని చంద్రబాబు పిలిచి ఆర్థికంగా ఆదుకుంటేనే ఆయన పోటీ చేస్తారని పాలేటి అనుచరులు అంటున్నారని భోగట్టా. మరోవైపు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో యాదవ సామాజికవర్గానికి చెందిన వారెవరికీ గతంలో పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో ఈసారి ఆ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం లభించే పరిస్థితి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పాలేటి రామారావుకు పోటీ చేసే అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. అయితే పాలేటి పోటీపై ఇంతవరకూ ఎటువంటి స్పష్టతా రాలేదు. అయితే ఈ విషయంలో యనమల కలగజేసుకుని పాలేటికి టిక్కెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తారనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.

Related Posts