YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పైసలిస్తేనే..కొత్త రుణాలు కర్నూలులో అధికారుల అవినీతి

పైసలిస్తేనే..కొత్త రుణాలు కర్నూలులో అధికారుల అవినీతి

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరులో డిఆర్‌డిఎ వెలుగు సిబ్బంది చేతివాట ప్రదర్శిస్తున్నారు. రుణం మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని, రుణం మొత్తంలో పది శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల కర్నూలు మండలంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.4 లక్షల చొప్పున రుణాలు మంజూరయ్యాయి. కొందరు కమ్యూనిటీ ఆర్గనైజర్లు రూ.5 వేలు చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పురపాలికల్లో ఇదే పరిస్థితి నెలకొంది.. వీటిల్లో రీసోర్సు పర్సన్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు సభ్యుల నుంచి 5 శాతం చొప్పున గుంజుకుంటున్నారు. స్వయం సహయక సంఘాల మహిళల నుంచి బ్యాంకు లింకేజీ రుణాల మంజూరులో జరుగుతున్న అవినీతి అక్రమాలను నివారించడంలో అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు స్వయం సహాయక సంఘానికి బ్యాంకు లింకేజీ రుణం రూ.3 లక్షలు మంజూరైంది. బ్యాంకు నుంచి సొమ్ము విడుదలైనప్పుడు తొలి విడతగా రూ.1500, రెండో విడతగా రూ.1740 దండుకున్నారు. ఆయా మొత్తాలను సమన్వయకర్త, సహాయ ప్రాజెక్టు మేనేజరుకు ఇవ్వాలని చెప్పి సిబ్బంది ఒకరు వసూలు చేయడం గమనార్హం. చెల్లింపుల సమయంలో గ్రామైక్య సంఘ ప్రతినిధులు కీలకపాత్ర పోషిస్తున్నారు.  33,193 స్వయం సహయక సంఘాలున్నాయి. ఈ ఏడాది స్వయం సహాయక సంఘాలకు రూ.881.83 కోట్ల రుణాలను మంజురు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 25 వేల స్వయంసహాయక సంఘాలకు రూ.661 కోట్లను బ్యాంకు లింకేజీ కింద రుణాలను మంజూరు చేశారు. స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభ్యున్నతికి దోహదపడాల్సిన డిఆర్‌డిఎ, ఐకెపి, వెలుగు సిబ్బంది కొందరు మామూలు ఇవ్వనిదే ఏ పనీ చేయడం లేదు. ఈ విషయంలో సంతృప్తి చెందితేనే బ్యాంకుల నుంచి వాటికి రుణాలు మంజూరయ్యేలా చూస్తున్నారు. ఇలా వారి అక్రమ వసూళ్లపై అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా స్పందన మాత్రం శూన్యం. రికార్డులు రాసినందుకు సంఘాల సభ్యులు సొమ్ము చెల్లిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి సిబ్బంది వరకు దండుకోవడంలో భాగస్వాములవుతున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రతి నెలా కొంత సొమ్ము పొదుపు చేసుకుని బ్యాంకులో జమ చేస్తారు. ఈ మొత్తం ఆధారంగా బ్యాంకు వారికి స్వయం ఉపాధి నిమిత్తం రుణాలు మంజూరు చేస్తుంది. ఈ క్రమంలో రికార్డుల నిర్వహణ, తీర్మానాల నమోదు, రుణాలు ఇప్పించేందుకు బ్యాంకులకు సిఫార్సు చేయడానికి ప్రభుత్వం యానిమేటర్లను నియమించింది. గ్రామానికి ఒకరు చొప్పున ఉండే వీరు తమ విధులు నిర్వర్తించినందుకు ప్రతి సంఘం నుంచి రూ.150 నుంచి 200 వరకు తీసుకుంటున్నారు. బ్యాంకు అనుబంధ పథకంలో రుణం మంజూరు చేయించాలంటే ఆ మొత్తంలో 2 నుంచి 10 శాతం వరకు నిర్బంధంగా వసూలు చేస్తున్నారు. తాము అడిగిన మేరకు ఎవరైనా ముడుపులు ముట్టజెప్పకపోతే రుణం పొందే అర్హత ఉన్నప్పటికీ వేరే సంఘానికి లబ్ధి చేకూరుస్తున్నారు. కొన్ని మండలాల్లో వెలుగు ఏపీఎంలతో కలిసి కమీషన్లను పంచుకుంటున్నారు. తాము ప్రతిపాదించిన వారికి మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా ఏపీఎంలతో సిఫార్సు చేయిస్తున్నారు. వీరి అవినీతిని కొందరు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక 1100 నంబరుకు తెలియజేశారు. దీంతో దృష్టి సారించిన ఉన్నతాధికారులు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లతో మాట్లాడి ఈ జాఢ్యాన్ని నివారించాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో మాత్రం యథావిధిగానే అక్రమ వసూళ్లు సాగుతూనే ఉన్నాయి. సగటున ఏటా రూ. వెయ్యి కోట్ల మేర రుణాలను సంఘాల మహిళలకు బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో డిఆర్‌డిఎ వెలుగు సిబ్బంది పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. కొందరు అధిక వసూళ్లకు పాల్పడటంతో గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా వెళ్లిన అధికారులకు ఒక్కో సంఘం నుంచి రూ.7 వేలు దండుకున్నట్లు చెప్పడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. రూపాయి... రూపాయి జమ చేసుకుని పొదుపు చేసుకున్న మహిళల నుంచి వసూళ్లు చేస్తున్నారు.. ఇప్పటికైనా అవినీతి అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్వయం సహాయ సంఘాల మహిళలు కోరుతున్నారు.

Related Posts