పాఠశాల విద్యలో గుణాత్మక మూల్యాంకనం కోసం సమ్మెటివ్1 పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ గురువారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈనెల 12 తేదీ నుంచి 29 తేదీ వరకు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 22 నుంచి 29 వరకు ప్రాథమిక తరగతులు విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించనున్నారు.గతేడాది నిర్వహించిన ఒఎంఆర్ (ఆబ్జెక్టివ్) విధానం పలు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ విధానాన్ని సమీక్షించిన విద్యాశాఖ పాత పద్థతిలోనే డిస్ట్రిక్టివ్ తరహా బిట్ ప్రశ్నాపత్రాల విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. ఇంతకుముందే మార్గదర్శకాలు జారీ చేయడంతో గందరగోళానికి తెరబడినట్లయింది. పదో తరగతిలో అంతర్గత మార్కులు 20 శాతం ఉంటాయి. వీటి మదింపులో ఈవిద్యా సంవత్సరం విద్యాశాఖ కొన్ని మార్పులు చేసింది. తనిఖీల్లో సొంత ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించినట్లు గుర్తిస్తే ఈ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేస్తారు. జిల్లాలో సుమారుగా 4 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధులు పరీక్షకు హాజరు కానున్నారు. గతేడాది అన్ని తరగతులకు ఎన్‌సిఇఆర్‌టి నుంచి ప్రశ్నాపత్రాలు సరఫరా చేశారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్ధులకు ఎస్‌ఎస్‌సి బోర్డునుంచి 6 నుంచి 9వ తరగతి వరకు ఎన్‌సిఇఆర్‌టి ప్రశ్నాపత్రాలు సరఫరా చేయనుంది.12న ఓరియంటల్ ప్రధాన భాషా పేపర్-1 (సంస్కృతం, ఒరియా, పర్షియా), 13న పేపర్-2, 15న ప్రథమ భాష పేపర్-1, 16న పేపర్-2 తెలుగు, కాంపోజిట్ కోర్స్, 17న హిందీ, 19న ఆంగ్లం-1, 20న ఆంగ్లం-2, 22న గణితం-1, 24న గణితం-2, 26న భౌతిక శాస్త్రం, 27న జీవశాస్త్రం, 28న సోషల్-1, 29న సోషల్-2 పరీక్ష ఉంటుంది. 6,7,8 తరగతులకు ఉదయం 10నుంచి 12.45 నిమిషాల వరకు, 9,10 తరగతులకు మధ్యాహ్నం 2నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాథమిక పాఠశాలల్లో 22న తెలుగు, 24న ఆంగ్లం, 26న గణితం, 27న పరిసరాల విజ్ఞానం పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక స్థాయిలో ప్రతి సబ్జెక్టులో 50 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి, పరీక్ష అనంతరం మరుసటి రోజు పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేసే ప్రత్యేక తరగతి నిర్వహించాల్సి ఉంటుంది..