రాష్ట్రంలో త్వరలో కొన్ని ప్రధాన నగరాలు,ముఖ్య పట్టణాల్లో 10వేల ఎలక్ట్రిక్ కార్లు,బస్సులను అందుబాటులోకి తెచ్చేదుంకు ప్రయత్నం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ్ వెల్లడించారు.రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంపై శుక్రవారం అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి దశ కింద రాష్ట్రంలో 10వేల ఎలక్ట్రిక్ కార్లు,బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లమిటెడ్(ఇఇఎస్ఎల్)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని అన్నారు.దీనిలో భాగంగా ఇప్పటికే విశాఖపట్నం,అమరావతి,తిరుపతిల్లో పైలెట్ ప్రాజెక్టుగా 300 ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు.ప్రస్తుతం నడుస్తున్న ప్రెట్రోల్,డీజిల్ తో నడిచే వాహనాలకంటే ఎంతో మెరుగైన రీతిలో ఈఎలక్ట్రిక్ వాహనాలు పనిచేస్తాయని వీటిని పెద్దఎత్తున వినియోగించేందుకు వీలుగా ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కలిగించేందుకు ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు.ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చినపుడు వాటిని చార్జింగ్ చేసేందుకు వీలుగా అవసరమైన ప్రాంతాల్లో తగినన్ని చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఎస్ చెప్పారు.ప్రభుత్వ శాఖలన్నిటిలో ఈవాహనాలను వినియోగించేందుకు వీలుగా ఆయా శాఖల వారీ డిమాండును అంచనా వేసి సమగ్ర నివేదికను రూపొందిస్తే సంబంధిత కార్యదర్శులు, శాఖాధిపతులు,జిల్లా కలక్టర్లకు వీటి వినియోగంపై తగు ఆదేశాలు జారీ చేస్తామని సిఎస్ పునేఠ స్పష్టం చేశారు.ఈవాహనాలు వినియోగ ఆవశ్యకతను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.అంతేగాక ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రోజువారి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సిఎస్ పునేఠ సంబంధిత సంస్థలు,అధికారులను ఆదేశించారు.
ఈసమావేశంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో 10వేల ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఇఇఎస్ఎల్ తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు.రాష్ట్రంలో ఈకార్యక్రమం అమలుకు నెడ్ క్యాప్ ను నోడలు ఏజెన్సీగా నియమించడం జరిగిందని చెప్పారు.ఈవాహనాలు వినియోగంలో ఆర్టీసీ ప్రధాన భూమికను పోషించనుందని అలాగే సంక్షేమ శాఖలకు కూడా ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు కోటి వాహనాలుండగా వాటిలో 80శాతం వరకూ ద్విచక్ర వాహనాలేనని ప్రతి ఏటా 13లక్షల వాహనాలు కొత్తగా వినియోగంలోకి వస్తున్నట్టు తెలిపారు.ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చినపుడు వాటిని చార్జింగ్ చేసుకునేందుకు వివిధ ప్రధాన పట్టణాల్లో చార్జింగ్ పాయింట్ల ను ఏర్పాటు చేయడం జరుగుతోందని 100 చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించగా ఇప్పటికే సచివాలయంలో 4 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయగా వివిధ ప్రాంతాల్లో 50 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని వివరించారు.
ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఎండి కుమార్ మాట్లాడుతూ అమరావతి, గుంటూరు,విశాఖపట్నం,తిరుపతిల్లో ఈవాహనాలుఅందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఈవాహనాల వినియోగంపై డిమాండును బట్టి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు.టిఆర్ అండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్,ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు మాట్లాడుతూ తిరుపతి నుండి తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఇప్పటికే ఆర్టీసీ టెండర్లు పిలవడం జరిగిందని అన్నారు.
ఈసమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్,రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం,ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ,నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు,ఇతర అధికారులు పాల్గొన్నారు.