- ప్రదీప్ ట్వీట్‌పై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్
బుల్లి తెర యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్న ప్రదీప్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో ప్రదీప్ పోలీసులకు పట్టుబడినప్పటికీ, అతన్ని వదిలేయమంటూ ఏకంగా పోలీసులకే రిక్వెస్ట్‌లు పెట్టారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రదీప్.. తాజాగా ఓ మంచి పనిచేసి మళ్ళీ వార్తల్లో నిలిచాడు.
టాయిలెట్ లేని పాఠశాల అంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్విట్టర్‌లో పోస్టు పెట్టింది. చర్లపల్లిలో 40 ఏళ్ల క్రితం ఈ పాఠశాలను నిర్మించారు. కానీ ఇప్పటివరకు ఆ పాఠశాలలో టాయిలెట్ లేదు. ఆ స్కూల్‌లో 120 మంది అమ్మాయిలు, 100 మంది అబ్బాయిలు చదువుకుంటున్నారు. టాయిలెట్స్ లేని కారణంతో విద్యార్ధులు భోజనం తర్వాత మంచి నీళ్లు కూడా తాగరు. ఎందుకంటే నీళ్ళు తాగితే టాయిలెట్ కొస్సాం చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని తెలుపుతూ వీ కేర్ అనే ఎన్‌జీవో సంస్థ ఈ ట్వీట్ చేసింది. ఈ పోస్ట్‌పై యాంకర్ ప్రదీప్ స్పందించాడు. ఈ పోస్టును రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ....చర్లపల్లిలోని ఆ పాఠశాలకు తమ టీమ్ వెళ్లి పరిశీలించిందని, నిజంగానే అక్కడ చాలా సమస్యలున్నాయని ప్రదీప్ ట్వీట్ చేశాడు. ప్రధానంగా బాలికలు టాయిలెట్ లేకపోవడంతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఆ పాఠశాలలో చదువుకొంటున్న బాలికల కోసం ఏదైనా చేయమని మంత్రి కేటీఆర్‌ను కోరాడు.
ప్రదీప్ ట్వీట్‌పై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ తక్షణ చర్యల కోసం మేడ్చల్ కలెక్టర్‌ను ఆదేశించారు. పని పూర్తి అయ్యాక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కూడా చెప్పారు. కేటీఆర్ ఆదేశాలపై స్పందించిన కలెక్టర్.. డీఈవో రేపు ఆ పాఠశాలకు వెళ్ళి టాయిలెట్లను పరిశీలిస్తారు. పాత వాటి స్థానంలో కొత్తవి నిర్మిచేలా చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించడంపై ప్రదీప్ హర్షం వ్యక్తం చేశాడు. కేటీఆర్‌కు ధన్యవాదలు తెలిపాడు.