ప్రజల్లో పట్టు లేకున్నా…. పార్టీలో ఇమేజ్ లేకున్నా వారికే అన్నీ అనుకూల నిర్ణయాలు వస్తున్నాయి. శశికళ బ్యాచ్ కు ఇది ఆశాభంగమే. అన్నాడీఎంకే పార్టీ తమ పరం కావడంతో అధికార పార్టీ నేతల్లో పట్టపగ్గాలు లేకుండా పోయాయి. రెండాకుల గుర్తు తమను గట్టెక్కిస్తుందని వీరు విశ్వసిస్తున్నారు. ఇటీవల మద్రాస్ హైకోర్టు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఎన్నికల సంఘం కూడా పార్టీ , గుర్తు ఈ వర్గానికేచెందుతుందని తేల్చి చెప్పడంతో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఇక ఉప ఎన్నికలపై దృష్టి పెట్టారు.తమిళనాడులో మినీ సమరం జరగబోతోంది. అది ఎప్పుడన్నది ఇంకా ఎన్నికల సంఘం నిర్ణయించకపోయినప్పటికీ 20 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల్లో ఆరు నెలల్లో జరుగుతాయన్నది వాస్తవం. ఒకవేళ అది సాధ్యం కాకుంటే లోక్ సభ ఎన్నికలతో పాటుగా జరిపే అవకాశాలు లేకపోలేదు. ఇక అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు తీర్పు పై తాను సుప్రీంకోర్టుకు వెళ్లేది లేదని, ఉప ఎన్నికలను ఎదుర్కొంటానని చెప్పడంతో ఇక ఎన్నికలు త్వరలోనే ఉంటాయన్నది అంచనా.గుర్తు దక్కిన పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు 20 స్థానాల్లో గెలుపు గుర్రాలను పార్టీ బరిలోకి దించాలని నిర్ణయించారు. గతంలో జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అతి విశ్వాసానికి పోయి భంగపడిన సంగతి తెలిసిందే. అక్కడ మధుసూదనన్ గట్టి అభ్యర్థి అయినా అక్కడ దినకరన్ వ్యూహం దెబ్బకు ఇక్కడ చతికల పడింది. ఈసారి ఇరవై నియోజకవర్గాల్లో ధీటైన అభ్యర్థులతో పాటుగా సరైన వ్యూహం రచించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రత్యేక ఏజెన్సీతో సర్వేలు నిర్వహించి అభ్యర్థులను ఖారరు చేయాలని ఇద్దరూ నిర్ణయించారు. పార్టీ గుర్తు తమకు అండగా ఉంటుందని వారు భావిస్తున్నారు.ఇక స్టాలిన్ కు ప్రజాదరణ పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరుణానిధి మరణం ఆ తర్వాత స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో ఆయన నాయకత్వానికి ఈ ఉప ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్న 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక తిరువారూర్ నియోజకవర్గం మాత్రమే డీఎంకే సిట్టింగ్ స్థానం. మిగిలినవన్నీ అన్నాడీఎంకే స్థానాలే. వీటిలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్ని స్టాలిన్ వ్యూహంగా ఉంది. ఇలా అధికార అన్నాడీఎంకే, దినకరన్, డీఎంకే పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఆ 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏకపక్షంగా అనర్హత వేటు వేశారంటూ ఇప్పటికే దినకరన్ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.