ప్రభుత్వ పథకాలు పార్టీలకతీతంగా అందరికీ చెందాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని దేవీ కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉండాలి గానీ కేవలం తమ పార్టీ కార్యకర్తలకి కాదన్నారు. డ్వాక్రా పథకాలలో తీవ్ర అవకతవకలున్నాయని మహిళలు చెబుతున్నారన్నారు. బ్యాంక్ ప్రతినిధులే డ్వాక్రా మహిళల ఇంటికి వచ్చి సేవలు అందించాలన్నారు. డ్వాక్రా మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేసే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. మహిళలకు అన్ని పార్టీలు కూడా చేయూతినివ్వాలని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం కూడా బాగుంటుందన్నారు. మహిళలకు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులు వచ్చినప్పుడు సమాజం బాగుంటుందన్నారు.