శబరిమల అయ్యప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో కేరళలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం, సన్నిధానంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను భక్తులు అడ్డుకోవడంతో కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సన్నిధానం, పంబ, నిలక్కల్ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఉత్తర్వులు జారీచేసిన పోలీసులు, 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఈ ఆజ్ఞలు శనివారం సాయంత్రం నుంచి సోమవారం అర్థరాత్రి వరకు కొనసాగుతాయి. ‘చితిర అట్ట విశేషం’ సందర్భంగా అయ్యప్ప ఆలయాన్ని నవంబరు 5 ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు తెరిచి, తిరిగి సోమవారం రాత్రి 10.30 గంటలకు మూసివేస్తారు. పార్కింగ్ ప్రదేశం నిలక్కల్‌లోని నవంబరు 5 ఉదయం 8 గంటల వరకే భక్తులు, మీడియా ప్రతినిధులను అనుమతిస్తామని పోలీసులు పేర్కొన్నారు. అలాగే ఇక్కడకు వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని, భద్రతా సిబ్బంది తనీఖ తర్వాతే పంబకు వెళ్లేందుకు అనుమతిస్తామని పత్తనంతిట్టా జిల్లా ఎస్పీ నారాయణన్ తెలియజేశారు. అలాగే మీడియా, భక్తులు తప్ప మిగతావారిని నిలక్కల్ నుంచి పంబకు అనుమతించమని అన్నారు. డీజీపీ ఆదేశాల ప్రకారం.. ఇద్దరు ఐజీలు విజయన్, అజిత్ కుమార్‌ల పర్యవేక్షణలో పోలీసుల బృందం భద్రతను నిర్వహిస్తుందని తెలిపారు. ఐదుగురు ఎస్పీలు, పది మంది డీఎస్పీలను నిలక్కల్, పంబ, సన్నిధానం, వడస్సేరికర ప్రాంతాల్లో విధులకు కేటాయించినట్టు తెలియజేశారు. నిషేధిత వయసు మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని హిందూ సంస్థలు, ఆర్ఎస్ఎస్‌లు హెచ్చరించడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. సన్నిధానంలో ఎక్కువ సమయం పాటు ఉండేందుకు ఎవర్నీ అనుమతించబోమని అంటున్నారు. సుప్రీంతీర్పుకు పోలీసులు కట్టుబడి ఉంటారని, భద్రత కల్పించమని ఎవరైనా మహిళలు కోరితే వారికి తప్పనిసరిగా రక్షణ కల్పిస్తామని అన్నారు.