- దక్షిణాఫ్రికా తనదైన శైలిలో దక్షిణాఫ్రికా గెలుపు
- ‘పింక్’ పోరులో భారత జోరు తేలిపోయింది.
- కోహ్లి కసిదీరా ఆడినా...సఫారీ తేలిగ్గా తేల్చేసింది.
భారత్ భారీ స్కోరు నిలవలేదు. పేస్ పదును సరిపోలేదు. స్పిన్ పాచిక పారలేదు. కొత్త చరిత్ర సృష్టించేందుకు వాన, వాండరర్స్ మైదానం రెండూ సహకరించలేదు. నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా ‘పింక్’స్థైర్యమే గెలిచింది. టీమిండియా ‘హ్యాట్రిక్’ విజయాలకు బ్రేకులేసింది. శనివారం ఆగి... ఆగి... సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (105 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా, కోహ్లి (83 బంతుల్లో 75; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. రబడ, ఇన్‌గిడి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత వర్షం కారణంగా దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 28 ఓవర్లలో 202 పరుగులుగా నిర్ణయించగా... ఆ జట్టు 25.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి గెలిచింది. సిరీస్‌లో ఐదో వన్డే మంగళవారం పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతుంది. ఆరు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 3–1తో ఆధిక్యంలో ఉంది.
మిల్లర్, క్లాసెన్ వీరబాదుడు : ఓపెనర్లు మార్క్‌రమ్ (22), ఆమ్లా(33), ఫస్ట్‌డౌన్ డుమిని(10) తక్కువ పరుగులకే ఔటయ్యారు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన విధ్వంసకారుడు ఏబీ డివిల్లీర్స్.. అందరూ ఊహించినట్లే చెలరేగి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ 26 పరుగులకే(18 బంతుల్లో) పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన మిల్లర్, క్లాసెన్‌లు ఆకాశమే హద్దుగా విజృంభించారు. చాహల్ బౌలింగ్‌లో లైఫ్‌లు పొందిన మిల్లర్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సఫారీకి గెలుపుబాట వేశాడు. జట్టుస్కోరు 174 ఉన్నప్పుడు మిల్లర్..5వ వికెట్‌గా ఔటయ్యాడు. అటుపై ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ క్లాసెన్ (27 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కడదాకా నిలిచి జట్టును గెలిపించాడు. ఫెలుక్‌వాయో (5 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భారత ఫీల్డింగ్ వైఫల్యాలు, కీలకమైన క్యాచ్‌ల నేలపాలు సఫారీకి కలిసొచ్చాయి. భారత బౌలర్లలో కుల్దీప్ 2 వికెట్లు పగడొట్టాడు. చాహల్, బూమ్రా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.