YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కొనసాగుతున్న ప్రకంపనలు

ఏపీలో కొనసాగుతున్న ప్రకంపనలు

రెండు రోజుల కిందట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కావడం, జాతీయస్థాయిలో ఆ పార్టీతో కలిసి పనిచేస్తామని ప్రకటించి రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుకు సిద్ధమని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్‌లోని హస్తం పార్టీ సీనియర్ నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వట్టి వసంత్ కుమార్ తన పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, తాను ఏ పార్టీలోనూ చేరబోనని, కొద్ది రోజుల తర్వాత సొంతగూటికే చేరుకుంటానని ఆయన ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ నేతలను తిట్టని రోజంటూ లేదని వ్యాఖ్యానించారు. అలాంటి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల కింద రూ.2 లక్షల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నా వాటిని సాధించుకోవడంలో చంద్రబాబు తీవ్రంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. విభజన హామీల విషయంలో ప్రజలకు బాబు అబద్ధాలు చెప్పారని, ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగలేక బయటకు వెళ్లిపోతున్నానని స్పష్టం చేశారు. అలాగే టీడీపీ-కాంగ్రెస్ పొత్తులపై పీసీసీకి కనీస సమాచారం కూడా ఇవ్వలేదనీ, సీనియర్ నేతలను సైతం సంప్రదించలేదని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుంటూరు పర్యటనకు వస్తే టీడీపీ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు, జెండాలు చూపి ఆయన్ని అవమానించిన విషయాన్ని మర్చిపోయారా? అని ఆయన నిలదీశారు. చంద్రబాబుకు సిద్ధాంతం, విలువలు లేవనీ, ఆయన ఎవరితోనైనా కలుస్తారని, ఆయన చేసిన పాపాల భారాన్ని తాము మోయలేమని స్పష్టం చేశారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సి రామచంద్రయ్య ఎన్టీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా, టీడీపీ పొలిట్‌బ్యూర్ మెంబర్‌గా కొనసాగారు. అయితే, 2008లో టీడీపీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు
 

Related Posts