విజయనగరం సంస్థానాధీశుడు. రాజకీయల్లోనూ సీనియర్. కేంద్రంలో కీలకమైన పౌర విమానయాన శాఖామంత్రిగా నాలుగేళ్ళ పాటు బాధ్యతలు చేపట్టిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఇపుడు విజయనగరం జనానికి బాగా అందుబాటులోకి వచ్చారు.అశోక్ ఇపుడు జనంలోకి రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నపుడు జిల్లాకు రావడమే అరుదు. వచ్చినా జాతీయ రాజకీయాలే తప్ప స్థానికంగా సమస్యలు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన చుట్టూ చేరిన అనుచరులు కూడా అశోక్ మెప్పు కోసం అంతా బాగుందంటూ తప్పు తోవ పట్టించేవారు. దాంతో అశోక్ జనాలకు దూరమైపోయారు. అత్యంత వెనకబడిన విజయనగరం జిల్లాను అశోక్ పట్టించుకోలేదన్న విమర్శలు గట్టిగా ఉన్నాయి కూడా.ఆరు నెలల క్రితం జాతీయ రాజకీయాల్లో మారిన సమీకరణలు అశోక్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసేలా చేశాయి. దాంతో డిల్లీ నుంచి ఆయన గల్లీ రాజకీయాలోకి వచ్చేశారు. అశోక్ లేని విజయనగరం జిల్లాలో చాల మార్పులు జరిగాయి. ఇంచార్జ్ మంత్రి గా గంటా శ్రీనివాసరావు. జిల్లా మంత్రిగా సుజయక్రిష్ణ రంగారావు చక్రం తిప్పారు. అశోక్ ని పక్కన పెట్టేసే రాజకీయమూ సాగింది. రాజు గారి మాటే చలామణీ కానీ పరిస్థితి కూడా తలెత్తింది. అయినా అశోక్ డిల్లీ మీదనే దృష్టి పెట్టేశారు. ఇపుడు ఆయన తన పట్టును మళ్ళీ సాధించేందుకు రంగంలోకి దిగారు. పార్టీలో వైరి వర్గాలను కట్టడి చేయడంతో పాటు జనంలో కూడా మెప్పు పొందేందుకు గల్లీ టూర్ స్టార్ట్ చేసేశారు.అశోక్ గజపతి రాజు పట్ల మునుపటి ఆదరణ జనంలో కనిపించడంలేదు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా జిల్లాకు ఏం సాధించలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. జనం సైతం అదే నమ్ముతున్నారు. వెనకబడిన జిల్లాను కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశంతో అభివృధ్ధి చేసుకోలేదని, నాలుగేళ్ళ పాటు పదవిలో ఉన్నా చేసింది శూన్యమని జనం పెదవి విరుస్తున్నారు. దానికి తోడు టీడీపీ పట్ల కూడా జనంలో ఇదివరకు ఆదరణ లేదు. బాబు పాలన పై వ్యతిరేకత బాగా పెరుగుతోంది. ఇవన్నీ కలసి రాజు గారి మీద కోపాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇపుడు జనంలోకి వచ్చి తిరిగినా అది ఓట్ల కోసం తప్ప మరేం కాదని జనం అంటున్నారంటే ఈసారి పూసపాటి వారికి పరాభవం తప్పదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.