ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుతో వెలుగులోకి వచ్చారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. మొదట్లో ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఉమ్మడి ఏపీకి ఆయన వచ్చిన కొత్తలో తొలుత ఫోక్స్ వ్యాగన్ కేసు నమోదైంది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయంలో తలపెట్టిన అవుటర్ రింగ్‌రోడ్డులో భూసేకరణ, అందులో జరిగిన అక్రమాలకు సంబంధించి దర్యాప్తు జరిపి న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఇది సద్దుమణిగేలోపే సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ కేసుపై సమర్థంగా దర్యాప్తు జరిపిన లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ కేసు కొలిక్కి వచ్చేలోపే దాదాపు ఒకే సమయంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసు, జగన్ అక్రమ ఆస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని అడ్డంపెట్టుకొని భారీగా అక్రమాలకు పాల్పడ్డ కుంభకోణాల కేసులే. ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఎంపీ గాలి జనార్దనరెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్టు చేయడంతో లక్ష్మీనారాయణ పేరు మారుమ్రేగిపోయింది.అప్పటి నుంచి యువతకు ఆయన రోల్ మోడల్ అయ్యారు. రాజీ పడని తత్వం ఆయనను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది. తర్వాత ఆయన వేరే రాష్ట్రానికి బదిలీ అయ్యారు. అయితే, ఊహించని విధంగా స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకుని ఉద్యోగం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. విభజన తర్వాత ఏపీలో ఉన్న పరిస్థితులకు చలించిపోయిన ఆయన రాష్ట్రానికి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. తాజాగా లక్ష్మీనారాయణ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనేదీ లేదని, కాకపోతే రైతుల అభివృద్ధి కోసం తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. అయితే, ఏదైనా పార్టీలో చేరుతారా..? లేక స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా..? రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతారా..? లేక జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా..? అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారని సమాచారం. రాయలసీమ జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.