హ్యుమన్ కంప్యూటర్ గా పేరొందిన శకుంతలాదేవి జయంతి నవంబరు 4. క్లుప్తంగా ఆమె గురించి.....
‘‘గణితం లేకుండా మీరేమీ చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే.’’
- శకుంతలా దేవి
గణితమే తన లోకంగా జీవించిన మేధావి శకుంతలాదేవి. గణితంతో మూడేళ్ల వయసులో మొదలైన ఆమె ప్రయాణాన్ని, మరణం మాత్రమే విడదీయగలిగింది.
శకుంతలాదేవి 1929 నవంబర్ 4న బెంగళూరులోని ఒక సనాతన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పూజారిగా ఉండటానికి ఇష్టపడక సర్కస్ కంపెనీలో చేరారు. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితులు కూడా శకుంతలాదేవి ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయాయి.
ఆమె మూడేళ్ల చిన్నారిగా ఉన్నప్పుడు తండ్రితో పేకాడుతూ ప్రతి ఆటలోనూ గెలిచేది. అంత చిన్నపాప ప్రతీసారీ తనపై గెలవడం తండ్రికి ఆశ్చర్యం కలిగించింది. తన కూతురు మోసం చేస్తుందేమోనని అనుమానం కలిగించింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఆడినా ఆమెదే విజయం. చివరకు.. పేక ముక్కలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం వల్లనే శకుంతల గెలుస్తోందని గుర్తించాడు. ఆమె అద్భుత జ్ఞాపకశక్తిని తమకు జీవికగా ఉపయో గించుకున్నాడు.
ఆమెతో ప్రదర్శనలిప్పిం చాడు. అలా అలా ఆమె ప్రతిభ విశ్వ విద్యాలయాలకు చేరింది. ఆరేళ్ల వయసులో తొలిసారి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆ తర్వాత ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో బాల మేధావిగా ఆమె పేరు మారుమోగింది.
శకుంతలాదేవికి లెక్కలంటే ఏమాత్రం లెక్కలేదు. ఎంత పెద్ద సమస్యనైనా ఆమె చిటికలో పరిష్కరించేవారు.
తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఆమె 1944లో తండ్రి చేయి పట్టుకుని లండన్ చేరుకున్నారు.
అనేక విశ్వవిద్యాలయాల్లో, వివిధ సంస్థల్లో ప్రదర్శనలిచ్చారు. 1950 అక్టోబర్ 5న బీబీసీలో తన గణిత ప్రతిభను ప్రదర్శిం చారు. లెస్లీ మిషెల్ ఇచ్చిన సమస్యను సెకన్లలో పరిష్కరించారు. ఆ సమాధానం తప్పని మిషెల్ అన్నారు. కానీ శకుంతలా దేవి తాను సరైన సమాధానమే చెప్పానని, సరిచూసుకోమని దృఢంగా చెప్పారు. ఆవిడ తిరిగి చూసుకుంటే శకుంతలా దేవి సమాధానమే సరైనదని తేలింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆమెకు ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే బిరుదు దక్కింది.
శకుంతలా దేవి ప్రతిభకు డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన మరింత అద్దం పడుతుంది. అమెరికాలోని ఈ యూనివర్సిటీవారు శకుంతలా దేవిని ఆహ్వానించారు. ఆమె ప్రతిభను పరీక్షించే పనిలో భాగంగా 201 అంకెలున్న సంఖ్యకు 23వ రూట్ చెప్పమన్నారు.
ఆవిడ 50 సెకన్లలో చెప్పేసింది. కానీ అది నిజమో కాదో తెలుసుకోవడానికి అమెరికన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ సంస్థలోని యూనివాక్-1101 అడ్వాన్స్‌డ్ కంప్యూటర్‌లో ప్రత్యేక ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చింది.
1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఆమె గిన్నిస్ రికార్డు సృష్టించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బెర్క్‌లీ) సైకాలజీ ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ 1988లో శకుంతలాదేవి ఇంటెలిజెన్స్‌ను అధ్యయనం చేశారు. అనేక క్లిష్ట సమస్యలను జెన్సన్ పేపర్‌పై రాసేకంటే అతి తక్కువ సమయంలో ఆమె పరిష్కరించి అతన్ని ఆశ్చర్యపరిచారు.
1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తోశకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించేశారు.
ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు
76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు.
ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది.
యూనివర్సిటీ ఆఫ్
కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.
గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.
1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.
శకుంతలా దేవి కేవలం గణిత మేధావి మాత్రమే కాదు. మంచి రచయిత కూడా. స్వలింగ సంపర్కంపై భారత దేశంలో తొలి సమగ్ర రచన అయిన ‘ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువాలిటీ (1977)’ శకుంతలా దేవి రాసిందే. దీనితో పాటు గణితం, జ్యోతిషంపై అనేక పుస్తకాలు రాశారు. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు
యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ 1969లో శకుంతలాదేవికి ‘మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇచ్చింది. వాషింగ్టన్ డీసీ 1988లో రామానుజన్ మేథమెటికల్ జీనియస్ అవార్డును ప్రదానం చేసింది.
శకుంతలా దేవి 1980లో మెదక్ నుంచి ఇందిరా గాంధీపై పోటీ చేశారు.
1980లో బెంగళూరుకు చేరి పిల్లల కోసం అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.