YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు..!!

చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు..!!

ఇవాళ సినిమా హీరోలలో అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని పేరుప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు. గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో , కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. సునాయాసంగా బయటపడ్డారు.

చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. ఏ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. కానీ చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు.

చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు. కానీ ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు.

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. వేదాగ్రణి ఆయన రసన మీద తిష్టవేసుకుని కూర్చున్నది. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.

ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు. ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి. ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం.

ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు బాలన్స్ లేదంటే నమ్ముతారా?

అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.

చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.

ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!!

చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు. ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.....

మిత్రమా !

ధుర్మార్గులను ఖండించక పోవుట ఏంతటి తప్పో
ఇట్టువంటి మహాత్ములను ప్రశంసించక పోవడం గూడా అంతే తప్పు ఔతుంది
ఒక మహోన్నతమైన వ్యక్తిని కీర్తించడం పదుగురికీ తెలియజేస్తున్న మీ మహోన్నత వ్యక్తిత్వం ప్రశంసనీయం ధన్యవాదములు

Related Posts