దీపావళి బాణాసంచ, పటాకులను కాల్చడానికిగాను సుప్రిం కోర్టు జారీచేసిన ఆదేశాలను పాటించాలని నగరవాసులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రహదారులు, జన సంచారం ఉన్న మార్గాల్లో భారీ శబ్దాన్ని కలగజేసే టపాసుల కాల్చివేతను పూర్తిగా నిషేదించినట్టు కమిషనర్ తెలిపారు. అయితే రాష్ట్ర కాలుష్య మండలి నిర్థారించిన పొగ, శబ్ద పరిమితిలో రాత్రి 8గంటల నుండి 10గంటలలోపు మాత్రమే టపాస్‌లను కాల్చాలని దానకిషోర్ స్పష్టం చేశారు. టపాస్‌ల కాల్చివేతను నిషేదించాలంటూ సుప్రిం కోర్టులో దాఖలైన వాజ్యంపై ఈ మేరకు తీర్పును ఇస్తూ సుప్రిం కోర్టు తీర్పును వెలువడిస్తూ ఆదేశాలను జారీచేసిందని పేర్కొన్నారు. సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు దీపావళి పండుగ రోజు రాత్రి 8గంటల నుండి 10గంటల మధ్య రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చాలని అన్నారు. టపాకాయలు కాల్చేముందు తగు భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు.