కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి వ్యూహం ముందు కాషాయపార్టీ కూలబడింది. మూడు లోక్సభ, రెండు శాసనసభ స్థానాలు సహా ఐదు స్థానాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం ఖరారైంది. ఇక బీజేపీ కంచుకోట శివమొగ్గలో సైతం బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టబోయినట్టు తయారైంది. ఈసారి ఆ పార్టీ ఇక్కడ స్వల్ప మెజారిటీతో గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమఖండి అసెంబ్లీ స్థానంతో పాటు బళ్లారి లోక్సభ స్థానంలో ఇప్పటికే కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది కర్నాటక బై ఎలక్షన్లలో. మరోవైపు మాండ్య లోక్సభ స్థానంలోనూ, రామానగరం అసెంబ్లీ స్థానంలోనూ జేడీఎస్ భారీ ఆధిక్యంతో విజయం ఖాయం చేసుకుంది.
రామానగరంలో ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి లక్షకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. బీజేపీ ప్రతికూలవాద రాజకీయాలను ప్రజలు తిరస్కరించారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కాంగ్రెస్ నేత దినేశ్ గుండూరావు వ్యాఖ్యానించారు. మరో తమకు భారీ విజయం కట్టబెట్టినందుకు కర్ణాటక ప్రజలకు మాజీ ప్రధాని, జేడీఎస్ చీప్ హెచ్డీ కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరీకరించేందుకు ప్రయత్నించేవారికి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆయన అన్నారు.