
కృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురడి సైన్యాలతో పోరాడుతున్న చిత్రం.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు,' బొద్దు పాఠ్యంపదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్ఠమైంది.
నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.
*సత్యం-శివం-సుందరం*
పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలము, పసుపు, తెలుపు- ఈ మూడు రంగులు మానవ మనుగడకు అవశ్యకమైన సత్త్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారుట పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం - అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా గైకొంటారు భారతీయులు.
అంధతమిస్రంచ దక్షిణాయనమేవచ
ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే
అంధ తమ్స్రమనేది ఒక నరకం, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్ధశి, అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి.