ప్రధాని నరేంద్రమోదీ ఫ్యాక్షనిస్టుగా మారి ఏపీ ప్రజలను వేధిస్తున్నారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయని తెదేపా జోస్యం చెప్పారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారన్నారు. ఏపీలో గెలుపు కోసం తెదేపా ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉన్నందునే జాతీయ కూటమి అనివార్యమైందని వివరించారు.వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను సైతం వెనక్కు తీసుకుని.. ఏపీపై కక్షసాధింపు చర్యలను ప్రధాని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మోదీ గొంతు బలంగా ఉందేమో గానీ..వ్యక్తిగా మాత్రం ఆయన బలహీనంగా కనిపిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ భాజపాకు భంగపాటు తప్పదని జేసీ పేర్కొన్నారు.