కనీస పోటీ లేదు. కాస్తయినా ప్రతిఘటన లేదు. కరీబియన్ల ఆట మరింత పేలవం. టీ20 సిరీస్ కూడా టీమ్‌ఇండియాదే. రోహిత్ శర్మ (111 నాటౌట్; 61 బంతుల్లో 8×4, 7×6) విధ్వంసక శతకం చేయడంతో మంగళవారం ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో భారత్ 71 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది రోహిత్‌తో పాటు ధావన్ (43; 41 బంతుల్లో 3×4) రాణించడంతో మొదట భారత్ 2 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఛేదనలో వెస్టిండీస్ తేలిపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులే చేయగలిగింది. చాలా ముందే ఆ జట్టు పరాజయం ఖాయమైంది. డారెన్ బ్రావో (23) టాప్ స్కోరర్. భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, బుమ్రా, కుల్‌దీప్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో విండీస్ ఫీల్డింగ్ కూడా పేలవం. నామమాత్రమైన మూడో టీ20 11న చెన్నైలో జరుగుతుంది. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.