భూమి అనుభవంలో 12 సంవత్సరాల పాటు వున్నట్లు అనుభవదారుడు ఏ ఒక్క డాక్యుమెంట్ ను ఆధారంగా చూపించినా సంబంధిత రైతు పేరు మీద భూమిని క్రమబద్దీకరించాలన్నారు. ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి అన్నారు. ముఖ్యమంత్రిఆదేశించిన విధంగా చుక్కల భూములకు నెలరోజుల్లో పరిష్కారం చూపించాలన్నారు. చుక్కల భూములు సమస్య పరిష్కారానికి సంబంధించి సచివాలయం వేదికగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ తో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతీ వారం జిల్లా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చుక్కల భూముల పరిష్కారానికి సంబంధించిన పురోగతిని సమీక్షించాలన్నారు. మండలాల వారీ గా ప్రతీ వారం చుక్కల భూముల పరిష్కార పురోగతి పై నివేదిక తెప్పించాలన్నారు. చుక్కల భూముల క్రమబద్దీకరణకు సంబంధించి ఇచ్చిన నిబంధనలను తాహశీల్దార్ల అవగాహన కోసం చట్టం మరియు రూల్స్ పై వివరణ ఇవ్వవలసినదిగా సూచించారు. దీని వల్ల అనవసరమైన డాక్యుమెంట్స్ కోరకుండా అభ్యర్ధనలు సత్వరంగా పరిష్కారం అవడానికి ఆస్కారం వుంటుందని ఇందుకు సంబంధించి సర్క్యులర్ ను సత్వరం విడుదల చేయాలన్నారు. చుక్కల భూములకు సంబంధించి ఇప్పటికే తిరస్కరించిన అభ్యర్ధనలను మరోసారి గ్రామసభల్లో పెట్టి నిజనిర్ధారణ చేయాలని కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉపముఖ్యమంత్రికి తెలిపారు.