YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రివ్యూ: థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌

  రివ్యూ: థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌

సినిమా: థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌

నటీనటులు: అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షేక్‌ తదితరులు

సంగీతం: అజయ్‌, అతుల్‌

సినిమాటోగ్రఫీ: మానుశ్‌ నందన్‌

కూర్పు: రితేశ్‌ సోని

నిర్మాణ సంస్థ: యశ్‌రాజ్‌ ఫిలింస్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌ కృష్ణ ఆచార్య

విడుదల తేదీ: 08-11-2018

ఈ ఏడాది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ ఒకటి. అగ్రకథానాయకులు అమితాబ్ బచ్చన్‌‌, ఆమిర్‌ ఖాన్‌‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. వీరికి అందాల భామ కత్రినా కైఫ్‌ కూడా తోడవడంతో అంచనాలు మరింత పెరిగాయి. కళ్లు చెదిరే సెట్టింగులతో, అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో, సరికొత్త పోరాట సన్నివేశాలతో సుమారు రూ.300 కోట్లు వెచ్చించి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్‌ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా ప్రత్యేకత సాధించింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అసలు ఎవరీ ‘థగ్స్‌’? చూద్దాం.

కథేంటంటే: రెండు శతాబ్దాల క్రితం బ్రిటిష్‌ పాలన కాలంలో దేశవ్యాప్తంగా కొన్ని ముఠాలు దారి దోపిడీలతో గడగడలాడించాయి. వారిని థగ్స్‌ (దోపిడీ దొంగలు) అని పిలిచేవారు. వారు బ్రిటిష్‌ ఖజానాను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ప్రభుత్వం వారిపై దృష్టిపెట్టింది. థగ్గులను ఏరిపారేయడానికి ప్రత్యేకంగా కొందరు అధికారులను నియమించింది. వారు థగ్గులను అణచివేయడానికి కర్కశంగా వ్యవహరించిన ఉదంతాలూ ఉన్నాయి. ఈ నేపథ్యానికి కల్పిత సంఘటనలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థగ్గుల బృందానికి కమాండర్‌గా ఖుదాబక్ష్ ఆజాద్‌ పాత్రలో అమితాబ్‌, ఫిరంగి అనే జిత్తులమారి థగ్గుగా ఆమిర్‌, విలువిద్యలో ఆరితేరిన జఫీరా అనే థగ్గుగా ఫాతిమా సనా షేక్‌ నటించారు. థగ్గులను అణగదొక్కడానికి వచ్చిన కర్కశ అధికారి జాన్‌ క్లైవ్‌గా హాలీవుడ్‌ నటుడు లాయిడ్ ఓవెన్‌‌ నటించారు. సురైయ్యా అనే అందమైన నర్తకిగా కత్రినా కైఫ్‌ నటించారు. ఆకాలంలోని బ్రిటిష్‌ ముఠాలను తరిమికొట్టడానికి ఈ థగ్స్‌ ఏం చేశారు? తదితర విషయాలను తెరపై చూడాలి.

ఎలా ఉందంటే: 1839లో వచ్చిన ‘కన్‌ఫెషన్స్‌ ఆఫ్‌ ది థగ్‌’ అనే నవల ఆధారంగా విజయ్‌ కృష్ణ ఆచార్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలాంటి నేపథ్యంలో గతంలో ఏ చిత్రమూ రాలేదు కాబట్టి ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రథమార్ధంలో యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధానికి ముందుకు వచ్చే ట్విస్ట్‌ బాగుంటుంది. కానీ ద్వితీయార్ధంలో కొన్ని చోట్ల వచ్చే సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయి. సంగీతం, నేపథ్య సంగీతం, సీజీఐ వర్క్‌, సెట్స్‌ ఆకట్టుకుంటాయి. యశ్‌రాజ్‌ ఫిలింస్‌కు తగ్గట్టు నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే: ఎప్పటిలాగే అమితాబ్‌, ఆమిర్‌ తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కత్రినా కైఫ్‌ తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె చేసిన డ్యాన్సులకు ఆడియన్స్‌ ఫిదా అవ్వక మానరు. యాక్షన్‌ సన్నివేశాల్లో ఫాతిమా సనా షేక్‌ అదరగొట్టేసింది. ‘దంగల్‌’ తర్వాత ఫాతిమాకు ఆ స్థాయిలో గుర్తుండిపోయేలా మరో పాత్ర దొరికింది. ఆమిర్‌ ఖాన్‌ వచ్చీ రాని ఆంగ్లంలో చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తాయి. ఆమిర్‌, అమితాబ్‌ కలిసి ఓ పాటలో డ్యాన్స్‌ చేయడం బాగుంటుంది. మిగతా వారంతా వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

బలాలు:

+ కథ

+ కత్రినా డ్యాన్స్‌లు

+ ఫాతిమా చేసే పోరాటాలు

+ సెట్స్‌, సీజీఐ వర్క్‌

బలహీనతలు:

- ద్వితీయార్ధంలో లాజిక్‌ లేని సన్నివేశాలు

చివరగా: ఈ ‘థగ్స్‌’ మెప్పిస్తారు..!

Related Posts