ఏపీ, తెలంగాణ విభజన తర్వాత ప్రముఖంగా చర్చకొచ్చిన తొలి అంశం సినీపరిశ్రమ తరలింపు. టాలీవుడ్ హైదరాబాద్ నుంచి తరలి వెళ్లిపోతోందని, బీచ్ సొగసుల విశాఖ నగరంలో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని తామరతంపరగా వార్తలొచ్చాయి. ఒకానొక సందర్భ ంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగిన ఓ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ ఈ విషయంపై ముచ్చటిస్తూ హైదరాబాద్ పరిశ్రమకు ధీటుగా మరో కొత్త పరిశ్రమ రూపకల్పనకు ఏపీ ప్రభుత్వం సన్నాహకాల్లో ఉందని ప్రకటించారు.అదే విషయంపై రకరకాల సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను సినీపెద్దలు కలవడంతో వైజాగ్ ఫిలింఇండస్ట్రీ గురించి ఆసక్తికర చర్చ సాగింది. నంది అవార్డుల వేళ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడునే సంప్రదిస్తే ఒక కొత్త పరిశ్రమ నిర్మాణం మాత్రం ఖాయం అంటూ ప్రకటన చేశారు. ఆ సంగతిని సినీపెద్దలు సైతం మీడియా ముఖంగా తెలియజేశారు. కానీ ఎందుకనో ఇంకా కొత్త పరిశ్రమ ఏర్పాటు విషయంలో అస్పష్టత నెలకొంది. ఇలాంటి సందిగ్ధ సమయంలోనే ఏపీఎఫ్‌డీసీ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. దాని సారాంశం.. విశాఖ నగరంలో కాపులుప్పాడ నుంచి భీమిలి పరిసరాల్లో ఒక కొత్త సినీపరిశ్రమ ఏర్పాటునకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారు.చెన్నయ్ కి చెందిన ప్రతిష్ఠాత్మక ఏవీఎం స్టూడియోస్, నందమూరి బాలకృష్ణ వైజాగ్‌లో స్టూడియోలు నిర్మించేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నది దాని సారాంశం. వీరికి భూములు కేటాయింపు ఉంటుందని ఎఫ్‌డీసీ అధికారికంగా ప్రకటించింది. ఇది సీఎం చంద్రబాబు ఆజ్ఞల ప్రకారం, ఎఫ్‌డీసీ అధ్యక్షుడు అంబికా కృష్ణ చేసిన ప్రకటన. పరిశ్రమ తరలింపు అని దీనిని అనలేను కానీ, ఓ కొత్త సినీపరిశ్రమ ఏర్పాటు మాత్రం జరుగుతుంది. ఆ మేరకు ప్రభుత్వం సన్నాహకాల్లో ఉంది. కానీ దీనిపై నాకు పూర్తి అవగాహన లేదు... అంటూ అసలు విషయం చెప్పకుండా దాటవేశారు.వైజాగ్‌లోనే పరిశ్రమ నెలకొల్పుతారా? అన్న ప్రశ్నకు.. పరిశ్రమ ఏర్పాటునకు ఎమినీటీస్ ముఖ్యం. క్యాపిటల్ సిటీ అమరావతిలోనే అయితే బావుంటుందని భావిస్తున్నారని ఓ అస్పష్టమైన సమాధానం ఇచ్చారు. విజయవాడ-- అమరావతితో పోలిస్తే వైజాగ్, అరకులో వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. అందుకే పరిశ్రమను అక్కడ ఏర్పాటు చేయాలని అనుకున్నారని తెలిపారు. ఈ స్పష్టత లేని ప్రకటనలతో కొత్త పరిశ్రమ వైజాగ్‌లోనా? అమరావతిలోనా? అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. దానిపై ఏపీ ప్రభుత్వానికే పెద్దంతగా క్లారిటీ లేదని అర్థమవుతోంది. లేదూ కొత్త పరిశ్రమ ఏర్పాటు గురించి కీలకమైన సమాచారాన్ని రివీల్ చేయకుండా దాచేస్తున్నారా? అన్న గందరగోళంపైనా సినీవర్గాల్లో చర్చ సాగుతోంది.