YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కమల్ దెబ్బకు కమలం చెక్...

 కమల్ దెబ్బకు కమలం చెక్...
కమల్ నాథ్… కరడుగట్టిన కాంగ్రెస్ వాది. కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు. కాంగ్రెస్ స్కంధావారాల్లో, రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఈ కురువృద్ధుడి గురించి తెలయని వారుండరని చెప్పడం అతిశయోక్తి కాదు. తొమ్మిది సార్లు వరుసగా లోక్ సభకు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ ప్రత్యేకతే 2014 లోక్ సభ ఎన్నికల అనంతరం ఆయననను ప్రొటెం స్పీకర్ ను చేశాయి. సాధారణంగా పార్టీలకు అతీతంగా సీనియర్ ఎంపీని ప్రొటెం స్పీకర్ గా నియమించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగానే 2014 జూన్ లో ఆయన ప్రొటెం స్పీీకర్ గా నియమితులయ్యారు. ఆ హోదాలో మొత్తం లోక్ సభ సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించి చరిత్ర సృష్టించారు. 1980 నుంచి వరుసగా ఎంపీగా ఎన్నికవుతున్న కమల్ నాధ్ ఇప్పుడు కీలక బాధ్యతల్లో ఉన్నారు. సహజంగా ఢిల్లీ రాజకీయాలు అంటే ఆసక్తి గల కమలనాధ్, అయిష్టంగానే రాష్ట్ర రాజకీయ రంగప్రవేశం చేశారని చెబుతారు.ఈ ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ మంత్రి వర్గాల్లో పనిచేసిన కమల్ నాథ్ వందల కోట్లకు అధిపతి. ఆయన అత్యంత సంపన్నుడు. ఆయన ఆదాయం 273 కోట్లుగా చెబుతుంటారు. పదిహేనేళ్ల పాటు రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న పార్టీని ఒడ్డున పడేయటం ఆయన ముందున్న కర్తవ్యం. ఈ ప్రయత్నంలో విజయవంతమయ్యేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.కమల్ నాథ్ ది వాస్తవానికి మధ్యప్రదేశ్ కాదు. యూపీలోని కాన్పూర్ లో 1946 నవంబరు 18న జన్మించారు. డూన్ స్కూల్ లో సంజయ్, రాజీవ్ గాంధీల సహాధ్యాయి. చిన్న నాటి నుంచే గాంధీల కుటుంబంతో గాఢమైన అనుబంధం ఉండేది. ఆ అనుబంధమే ఆయనను కాంగ్రెస్ వాదిగా మార్చింది. కమల్ నాథ్ తొలిసారిగా 1980లో ఇందిరాగాంధీ హయాంలో లోక్ సభకు బింద్వారా స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయనకు వెనుదిరిగి చూసే పరిస్థితి కలగలేదు. 1984 లో ఇందిర హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎనిమిదో లోక్ సభకు ఎన్నికయ్యారు. 1989లో 9వ లోక్ సభకు, 1991లో పదో లోక్ సభకు ఎన్నికయ్యారు. 1991లో పీవీ మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ మంత్రిగా నియమితులయ్యారు. చేనేత, జౌళి శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. 1998లో 12వలోక్ సభకు 1999లో 13వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 2001 నుంచి 2004 వరకూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సమర్థంగా బాధ్యతలను నిభాయించారు.2004లో 14వ లోక్ సభకు ఎన్నికయ్యారు. మన్మోహన్ మంత్రివర్గంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా 2009 వరకూ పనిచేశారు. 2009లో 15వ లోక్ సభకు ఎన్నికై రవాణాశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2014లో మళ్లి బింద్వారా నుంచి ఎన్నికై లోక్ సభలోకి అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం వీచినప్పటికీ మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. రాష్ట్రంలోని మొత్తం 29 లోక్ సభ స్థానాల్లో రెండే రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. కమల్ నాధ్ తో పాటు గ్వాలియర్ రాజవంశీకుడు జ్యోతిరాదిత్య సింధియా గుణ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లో రత్లాం స్థానం కాంగ్రెస్ పరమైంది. క్షేత్రస్థాయిలో ప్రజాబలం, చేసిన మంచి పనుల కారణంగానే ఇంతటి మోదీ ప్రభంజనంలో కూడా కమల్ నాథ్, జ్యోతిరాదిత్య విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడైన కమల్ నాథ్ కు జాతీయ రాజకీయాలు అంటేనే మక్కువ ఎక్కువ. రాష్ట్ర రాజకీయాలు ఆయనకు అంతగా సరిపడవు. చివరకు రాహుల్ వత్తిడితో అయిష్టంగానే పీసీీసీ చీఫ్ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అసంతృప్తివాదులను బుజ్జగిస్తూ ఐక్యత అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. వర్గాలు అనే మాట వినకుండా జాగ్రత్త పడుతున్నారు.సహజంగా పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పదవిపై కన్నేస్తారు. కానీ తనకు పదవి ముఖ్యం కాదని, పార్టీ విజయమే ముఖ్యమని చెబుతున్నారు. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇవ్వలేదు. తనకు పదవులు కన్నా 2003లో కోల్పోయిన అధికారాన్ని పదిహేనేళ్ల అనంతరం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు తన భుజస్కంధాలపై గురుతర బాధ్యతలను మోపారని, వాటిని విజయవంతంగా నెరవేర్చడమే తన కర్తవ్యమని నమ్రతగా చెబుతూ పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వాస్తవానికి గుణ ఎంపీగా గ్వాలియర్ రాజవంశీకుడు, యువనాయకుడు జ్యోతిరాదిత్య సింధియా రూపంలో గట్టి పోటీదారుడు ఉన్నారు. అయినా సింధియాను పోటీదారుడిగా కాకుండా సహచరుడిగా చూస్తున్నానని, పార్టీ గెలుపే ముఖ్యమని చెబుతున్నారు. పదిహేనేళ్లుగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, జీఎస్టీతో మసకబారుతున్న మోదీ ప్రభ కారణంగా తమ విజయం తథ్యమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి గుదిబండగా “వ్యాపం”కుంభకోణం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు, నాయకుల ఆగడాలు మితిమీరాయని, ప్రభుత్వం అవినీతిమయమయిందని ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటి వరకూ ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్ నాథ్ పీసీపీ చీఫ్ గా కొత్త బాధ్యతల్లో విజయుడవుతారని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. ఆయనా అదే ధైర్యంతో ముందుకు సాగుతున్నారు.

Related Posts