ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పని తీరుపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన మానేసి చంద్రబాబు దేశ వ్యాప్తంగా రాజకీయం చేస్తున్నారన్నారు. కుమారులకు పదవులను కట్టబెట్టేందుకే బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలు ఒక గొడుగు కిందకు వస్తున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని, లోకేష్, స్టాలిన్లను ముఖ్యమంత్రులను, కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కాపాడటానికే ప్రత్యర్థులందరూ కలుస్తున్నారని ధ్వజమెత్తారు.
మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావును గృహ నిర్భంధం చేసి బీజేపీ నేతలపై లాఠీఛార్జి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని నిప్పులు చెరిగారు. అభివృద్ధి పనులు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనుల్లో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతోందని, టీడీపీ పాలన మొత్తం అవినీతిమయమేనని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు.