ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మాణం చేపడుతున్నారో.. లేక హ్యాపీ నెస్ట్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో ప్రజలకు అర్ధం కావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడలోని దాసరి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సీఎం.. సీఆర్డీఏ పేరును చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఇలాంటి జిమ్మిక్కుల వల్ల రాజధాని ప్రతిష్ఠ దెబ్బ తింటుందని అన్నారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తును ప్రజలు విశ్వసించటం లేదని పేర్కొన్నారు. తక్షణం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.