YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

చెరుకూరి ఫైనాన్స్ చీటింగ్

చెరుకూరి ఫైనాన్స్ చీటింగ్

చెరుకూరి ఫైనాన్స్‌...! ఈ ఆర్థిక సంస్థ.. ప్రజల నమ్మకాల పునాదులపై ఏర్పాటై.. నేడు వారిని వంచించడమే లక్ష్యంగా సాగుతోంది. రాష్ట్రంలో కూలీ మొదలు.. పెద్ద ఉద్యోగి వరకూ.. చాలామందే ఈ సంస్థను నమ్మి నెలవారీగా  డబ్బును పొదుపు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే.. భారీగా డిపాజిట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న చెరుకూరి ఫైనాన్స్‌ నిర్వాహకులు.. పెన్షనర్లను టార్గెట్‌గా చేసుకున్నారు. 

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 27శాతం వడ్డీ చెల్లిస్తామని, కోరినప్పుడు డబ్బు తిరిగిస్తామని నమ్మబలికి.. భారీగా డిపాజిట్లు వసూలు చేసింది. జీవిత చరమాంకంలో.. పెద్దమొత్తంలో తిరిగి వచ్చే డబ్బుతో హాయిగా జీవించవచ్చన్న ఆశతో.. పెన్షనర్లు.. తమ వద్దనున్న రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ మొత్తాలను చెరుకూరి ఫైనాన్స్‌ సంస్థలో పెట్టుబడి పెట్టారు. దాదాపు 30 మంది పెన్షనర్లు.. ఐదు కోట్ల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టారు. 

చెరుకూరి ఫైనాన్స్‌లో పెట్టుబడి పెట్టినవారంతా మధ్యతరగతి బడుగు జీవులే. వారి డిపాజిట్లను మింగేసిన సంస్థ నిర్వాహకులు.. నిలదీసే అమాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. 27శాతం వడ్డీ సంగతేమోగానీ, 12 శాతం వడ్డీ కూడా చెల్లించడం లేదు. వారి మోసాన్ని భరించలేక.. డిపాజిట్‌దారులు.. తమ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరితే.. బెదిరింపులకు తెగబడుతున్నారు. 

చెరుకూరి ఫైనాన్స్‌ సంస్ధపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ వైట్‌కాలర్‌ నేరాలకు పాల్పడ్డట్లు వెల్లడి కావడంతో.. బాధితులు అవాక్కయ్యారు. తమ డబ్బును ఇప్పించాలంటూ.. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిపాజిటర్లలో ఒక్కరికి కూడా డబ్బు చెల్లించని చెరుకూరి ఫైనాన్స్‌ నిర్వాహకులు.. ఎవరైనా ఒత్తిడి చేస్తే.. కోర్టులోనైనా డిపాజిట్‌ చేసి మీ సొమ్ము చెల్లిస్తామని నమ్మబలుకుతూ వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. 

చెరుకూరి ఫైనాన్స్‌ సంస్థ అవకతవకలు.. ఆర్థిక నేరాలపై బాధితులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావును ఆశ్రయించారు. తక్షణం స్పందించిన విహెచ్‌.. రాచకొండ పోలీసు కమీషనర్‌ మహేశ్‌ భగవత్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఆయన.. కేసును నమోదు చేసి విచారించాలంటూ.. ఎల్‌బీనగర్‌ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు. 

ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని.. చెరుకూరి ఫైనాన్స్‌ నిర్వాహకులు.. తమ సొంత రియల్‌ ఎస్టేట్‌ దందాకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో.. ఇప్పుడు కొత్త కథ అల్లుతోందీ సంస్థ. సోమేశ్వరరావు అనే వ్యక్తి, ఈ సంస్థలో నకిలీ ప్రామిసరీ నోట్లు సృష్టించి, తమ సంతకాలు ఫోర్జరీ చేసి.. సుమారు ఐదు కోట్లు ఎత్తుకెళ్లాడని, అతడు పరారీలో ఉన్నాడని.. బాధితులను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. డిపాజిట్‌లకు గడువు మీరి నెలలు గడుస్తున్నా.. చెరుకూరి ఫైనాన్స్‌లో పెట్టిన సొమ్ము తిరిగి రాకపోవడంతో.. డిపాజిట్‌దారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 

Related Posts