అమరాతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అపార్ట్‌మెంట్ల నిర్మాణం (హ్యాపినెస్ట్)పై సాధారణ ప్రజలతో పాటు, మధ్యతరగతికి అందుబాటులో ఉండదని మొదటి నుండి వ్యక్తమైన అనుమానాలు నిజమైనాయి. తొలివిడతగా ఆన్‌లైన్ బుకింగ్‌లో ఉంచిన 300 ప్లాట్లలో అత్యధికభాగం ఎన్‌ఆర్‌ఐలు సొంతం చేసుకున్నారు. ప్లాట్లను బుక్ చేసుకోవడానికి వీరు పోటీ పడటంతో ఒక దశలో సిఆర్‌డిఎ చేసిన ఏర్పాట్లు చాలని స్థితి ఏర్పడింది. ఈ పరిణామం ఎన్‌ఆర్‌ఐ కుటుంబాల్లోతో పాటు, ప్రభుత్వ వర్గాల్లోనూ ఆనందం నింపింది. రాజధానిపై గంపెడాశలు పెట్టుకున్న సామాన్య ప్రజానీకం మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన భారీ రేట్లతో పోటీ పడలేక వెనక్కితగ్గాల్సిన స్థితి పరిస్థితి ఏర్పడింది. రైతులిచ్చిన భూములతో భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసిన ప్రభుత్వం అదే సమయంలో రైతులు క్రయ విక్రయాలు చేయడానికి మాత్రం మరో రెండేళ్లు ఆగాల్సిందేనని హుకుం జారీ చేసింది. సమీకరణలో భాగంగా రైతులకు కేటాయించిన భూమిలో ఇంతవరకు కనీస అభివృద్ధి పనులు కూడా చేయలేదు. ఒకవైపు ప్రభుత్వ వ్యాపారం జోరుగా సాగు తుండగా రైతులు మాత్రం భూమిని ఎప్పుడు అభివృద్ధి చేస్తారా, ఎప్పుడు అమ్ముకోవడానికి అనుమతిస్తారా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.సింగపూర్ కన్సార్టియం సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందని 2016 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం కొన్ని షరతులూ విధించింది. దీనిపై చర్చలు జరిగాయి. ఇంతవరకు కొలిక్కిరాలేదు. కనీసం చిన్న ప్రహరీగోడ కూడా కన్సార్టియం కట్టలేదు. ప్రభుత్వ కోర్ ఏరియా వచ్చే చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులకు కేటయించిన ప్లాట్లలో అడపా దడపా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అవి పూర్తయ్యే సరికి మరోఏడాది పడుతుంది. వరద ముంపు లేకుండా ప్రస్తుతం ఉన్న భూమిని ఆరు నుండి ఎనిమిది అడుగుల ఎత్తు లేపాలని 2015లో సిఆర్‌డిఏ అంచనా వేసింది. దీనికి అనుగుణంగానే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా పది అడుగుల ఎత్తులో నిర్మించింది. రైతుల భూములు ఎత్తు లేపడంపై ఇంతవరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. రాజధాని గ్రామాల్లో సదుపాయాలు కల్పిస్తామని, వైద్యశాలలు, పాఠశాలలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ప్రభుత్వం ఆధ్వర్యాన జూనియర్ కళాశాలను కూడా నిర్మించలేదు. ఏడాదిలోపు పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని 2015 మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2018 ముగ్గుస్తున్నా ఇళ్లన్నీ నిర్మాణదశలోనే ఉన్నాయి. రాజధానికి అనుసంధానంగా కృష్ణానదిలో వెంకటపాలెం, ఇబ్రహీంపట్నం వద్ద రెండు వంతెనలు నిర్మిస్తామని హామీనిచ్చారు. అవే ఐకానిక్ బ్రిడ్జిలనీ చెప్పారు. అవి కూడా అంచనాల దశలోనే ఉన్నాయి. గ్రామాలన్నిటిలో అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పారు. ఇప్పటికీ రాజధానిలో నాలుగు మాత్రమే ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లో పూర్తిస్థాయిలో మంచినీటి సదుపాయం లేదు. ఐనవోలు, కురగల్లు, శాఖమూరు, నేలపాడు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిర్మాణ పనులతో గ్రామాలన్నీ కాలుష్యం బారిన పడ్డాయి. మరోవైపు వరకూ వివిధ సంస్థలకు 1250 ఎకరాలకుపైగా కట్టబెట్టారు. అవన్నీ కూడా యుకెజి పిల్లలకూ లక్ష రూపాయలకు తక్కువ గాకుండా ఫీజు వసూలు చేసే సంస్థలే కావడం విశేషం. ఆయా స్కూళ్లలో రాజధాని ప్రాంతానికి చెందిన పిల్లలు ఎంతమంది చదువుతారనేది ప్రశ్నార్థకం.