YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

 ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసు దాసుగారు, ఏ ఏ సందర్భంలో, ఏ ఏ వృత్తాలలో-జాతులలో-ఉప జాతులలో పద్యాలు రాసారో తెలుసుకుందాం. ఉద్దండ కవిపండుతులు, వాసు దాసుగారు తన ఆంధ్ర వాల్మీకిరామాయణంలో చేసిన ఛందో ప్రయోగాలమీద, ఒక్కసారి వారి పరిశోధనాత్మకదృష్టిసారించి, ఈ తరంవారికి-భావితరాలవారికి ఆ మహానుభావుడి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆశతో దీన్ని కూర్చడం జరిగింది. అర్థం చేసుకుంటారనుకుంటాను.
బాల కాండలో ఛందః ప్రయోగాలు
శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రను, వీరు ఆచరించిన ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకు, శత కోటి గ్రంథాత్మకమైన ప్రబంధంగా, ఓ బృహత్ గ్రంథాన్ని రచించి నారదుడికి, ఇతర మహర్షులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. అంతటితో ఆగకుండా భూలోక వాసుల కొరకై శ్రీరామ భక్తుడైన వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. వాల్మీకి రచించిన రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే.
శ్రీరామచంద్రుడు బాలుడుగా వున్నప్పుడు జరిగిన సంగతులు తెలిపేది కాబట్టి దీనికి "బాల కాండ" అని పేరు."కాండం"అంటే జలం-నీరు. శ్రీ రామాయణం మహార్ణవంగా చెప్పడంవల్ల, అందులోని జలం కాండమనబడింది. శ్రీ రామాయణంలోని ఏడు కాండలలో "ఏడు వ్యాహృతుల" అర్థం నిక్షిప్తమైంది. బాల కాండలో "ఓం భూః" అనే వ్యాహృత్యర్థం వుంది. అది గ్రంథ పఠనంలో తెలుస్తుంది. ఈ కాండలో శ్రీరామచంద్రమూర్తైన విష్ణువే "జగజ్జనన కారణభూతుడు" అనిబోధపడుతుంది.జననం మొదలు ఇరవై అయిదు ఏళ్లు వచ్చేవరకూ రాముడు చేసిన చర్యలు ఈ కాండలో వున్నాయి. పన్నెండో ఏట పెళ్లైనప్పటినుండి పట్టాభిషేకం ప్రయత్నం జరిగే వరకు చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదు. బాల కాండ వృత్తాంతమంతా 12 సంవత్సరాల కాలంలో జరిగింది.
బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం జరిగింది. రామాయణంలో చెప్పబడిన పర తత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పర తత్వాన్ని స్థాపించి, పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతనిఅర్థం చేసుకోవాలి. శరణా గతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగకాలనే ఈ గ్రంథంలో స్పష్టమవుతుంది. ఇట్టి శరణాగతికి పురుష కారం అవశ్యం. పురుష కారానికి కావాల్సిన ముఖ్య గుణం శరణాగతుడి పట్ల దయ. ఈ గ్రంథంలో పురుష కారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్య వలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది. శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచక జ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు-అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే.వేదాధ్యయనంలో సు సంపన్నుడు, వ్యాకరణాది వేదాంగాలను తెలిసిన నారదుడు వాల్మీకి దగ్గర కొచ్చి చెప్పిన రామ చరిత్రను విన్న వాల్మీకి సంతోషంతో ఆయన్ను పూజించి, ఆయన పోయిన తర్వాత, తమసా నదిలో స్నానం చేయడానికి పోతున్న సందర్భంలో "మత్తకోకిలము" వృత్తంలో చక్కటి పద్యాన్ని రాసారు వాసు దాసుగారీవిధంగా:
మత్తకోకిలము:        రాజితద్యుతి వాల్మీకర్షియు  రాఁ గ  వెన్కొనిత  న్భర
            ద్వాజుఁ డన్ప్రియశిష్యవర్యుఁ డు  వారి  నాడఁ గ  నేగి,  పే
            రోజమై  నడిమింట  రాజిల నుగ్రదీధితి,  చార్వను
            ద్వేజితాంబులఁ  గాంచి  యిట్లనుఁ  బ్రీతుఁ డై నిజశిష్యుతోన్-1
తాత్పర్యం:    బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే ఆ మహర్షివెంట ఆయన ప్రియ శిష్యుడు భరద్వాజుడువున్నాడు. వీరిరువురు కలిసి, మధ్యాహ్నిక కర్మానుష్ఠానానికి స్నానం చేద్దామని, తమసానదిలో దిగుతారు. తేటగా-నిర్మలంగా నదిలో వున్న నీళ్లను చూసి వాల్మీకి శిష్యుడు భరద్వాజుడితో ఇలా అన్నాడు.
ఛందస్సు:మత్తకోకిలము వృత్తానికి  ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
అప్పుడాయన (వాల్మీకి) కంటికి సమీపంలో, మనోహరంగా కూస్తూ, వియోగం సహించలేని క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆ సమయంలో, తాను చూస్తున్నానన్న లక్ష్యం కూడా లేకుండా, సహజంగా జంతువులను హింసించే స్వభావమున్న బోయవాడొకడు, రెండు పక్షులలో మగదాన్ని బాణంతో చంపి నేల కూల్చాడు. క్రూరుడైన బోయవాడిపై దయ వీడి శపించాడు వాల్మీకి. సంస్కృత రామాయణంలో ఆ శ్లోకం ఇలా వచ్చింది వాల్మీకి నోట:
"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారిలా తెనిగించారు ఆ శ్లోకాన్ని:
"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"
రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకమిది. ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసుదాసుగారు మొట్టమొదట రాసిన పద్యమూ ఇదే. "మానిశాద" శ్లోకం అంతవరకు తెనిగించినవారు లేరంటారు కవి. వ్యాఖ్యాతలు రాసిన అన్ని అర్థాలు వచ్చేట్లు రాయడం కష్టమనీ, దీన్ని తెనిగించగలిగితే మిగిలిందంతా తెనిగించడం తేలికవుతుందనీ భావించి, తనను తాను పరీక్షించుకోదల్చి, తొలుత ఆ పద్యాన్ని రాసానంటారు వాసుదాసుగారు.
రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకంలో, ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసుదాసుగారు మొట్టమొదట రాసిన మొదటి పద్యంలో నాలుగు పాదాలున్నాయి. పాదానికి 13 అక్షరాలు. సాంఖ్యశాస్త్రంప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుంది. ఎందుకంటే, వర్ణసమామ్నాయంలో 13వ అక్షరం "ఓ" విష్ణు అనే అర్థమున్న "మానిషాద" శబ్దం "అ" కారాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ” స్త్రీ లింగం. ఇక్కడ స్త్రీ వాచకం ప్రకృష్టమైంది. ప్రతిష్ఠ అనేది లక్ష్మీ వాచకమైన "ఉ" కారాన్ని బోధిస్తుంది."నీక" అనేది "ఉ" కార మొక్క అవథారణార్థకాన్ని తెలుపుతుంది. "క్రౌంచ మిథునంబునందు నొక్కండు", ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అనీ, దాని సంబంధంవల్ల అల్పమైన జ్ఞానమున్నవాడు (బద్ధ జీవుడు) పురుషుడని అర్థం చేసుకోవాలి. ఇది "మ" కారాన్ని బోధిస్తుంది.
వాసుదాసుగారు రాసిన మొదటి పద్యం రామాయణార్థాన్ని సంపూర్ణంగా సూచిస్తుంది. "మానిషాదుండ... ... అంటే లక్ష్మికి నివాస స్థానమయిన శ్రీనివాసుడా, శ్రీరాముడా"  అనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ నీక శాశ్వతంబగు" అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. "శాశ్వతహాయనముల" అనే పదంలో రాముడు దండకారణ్యంలో ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చి నందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే అరణ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధ కాండార్థాన్ని సూచిస్తుంది. క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ అర్థాన్ని సూచిస్తుంది. ఇలా రకరకాలుగా రామాయణార్థం సూచించబడిందీ పద్యంలో.
    బోయవాడు చేసిన పనికి కలిగిన దుఃఖంతో బాధపడ్డ వాల్మీకి, వాడిని దూషిస్తూ చెప్పిన పద్యం గురించి, తదేక ధ్యానంతో ఆలోచిస్తున్న సమయంలో, ఆయన్ను చూడడానికి వచ్చాడు బ్రహ్మదేవుడు. పది దిక్కులకు తన తేజస్సును వ్యాపింపచేస్తూ, యోగి శ్రేష్ఠులు చేతులు జోడించి వెంబడి వస్తుంటే, వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా కానరాని బ్రహ్మదేవుడు, తనంతట తానే, దేవతా సమూహం చుట్టూ చేరి సేవిస్తుండగా వచ్చాడు. ఇలా బ్రహ్మ తన ఇష్టులతో, శిష్టులతో రావడంతో, వాల్మీకి తటాలున లేచి, మిక్కిలి భక్తితో మ్రొక్కి, నిలబడి ఈయనెందుకొచ్చాడా అని కారణం వెతకసాగాడు. ఈ సందర్భాన్ని "పంచ చామరం" పద్యంలో చెప్పారు కవి ఎలా:

                                                                     రేపు తరువాయి భాగం.. 

Related Posts