తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు 2014 నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. మా పార్టీ నేతలను సంతలో గొర్రెల్లాగా కొనుక్కుంటున్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలని పార్టీల అధినేతలు, అధ్యక్షులు.. స్పీకర్, ఈసీకి పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
అయితే ఈ విషయంపై తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతూ.. నచ్చిన పార్టీలో చేరొచ్చు.. కానీ పార్టీ వల్ల వచ్చిన పదువులను వదులుకొని వేరే పార్టీలో చేరాలని స్పష్టం చేశారు. ఈ మాటలు ఒక్క ఏపీ, తెలంగాణ గురించే కాదని దేశం మొత్తంగా గురించి మాట్లాడుతున్నానన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ సభలు జరుగుతున్న తీరు బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. చట్టసభల్లో అర్థవంతంగా చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. పార్లమెంట్ ఉభయ సభలు ఐదురోజులు జరిగితే కనీసం ప్రశ్నోత్తరాలు కూడా పూర్తికాకపోవడం దారుణమన్నారు. సభను వాయిదా వేయడానికి చాలా కారణాలున్నాయి. సమస్య ఏదైనా చర్చించుకోవాలి.. సభలు సజావుగా సాగాలని వెంకయ్య స్పష్టం చేశారు.