YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గాలి కేసులతో.. బీజేపీకి తలనొప్పి

గాలి కేసులతో.. బీజేపీకి తలనొప్పి
గాలి జనార్థన్ రెడ్డి. మైనింగ్ కింగ్…. అక్రమంగా మైనింగ్ నిర్వహించి వివిధ ఆరోపణలను ఎదుర్కొన్న గాలి జనార్థన్ రెడ్డి తాజాగా ఈడీ లంచం కేసులో ఇరుక్కోవడం ఒక్క కర్ణాటకకే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాలి జనార్థన్ రెడ్డి వంటి అవినీతిపరులను, అక్రమ వ్యాపారాలను చేసే వారిని పక్కన పెట్టుకుని కమలం పార్టీ రాజకీయాలు నడుపుతుందన్న విమర్శలు ఇప్పటికే దేశవ్యాప్తంగా వస్తున్నాయి. దీంతో బీజేపీ అధిష్టానం గాలి జనార్థన్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేయాలని భావిస్తోంది. కమలానికి ఇక “గాలి” సోకకుండా ఉండేలా జాగ్రత్తలు పడుతుంది. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గాలి జనార్థన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడు కావడం కూడా మంత్రి పదవి దక్కడానికి కారణమయింది. గాలి జనార్థన్ రెడ్డి కేవలం ఆర్థికంగా బలవంతుడే కాకుండా జనం బలం ఉన్న నేత కూడా కావడతో కమలం పార్టీ అక్కున చేర్చుకుంది. ముఖ్యంగా బళ్లారి ప్రాంతంలో ఆయనకున్న పట్టును చూసే యడ్యూరప్ప సయితం గాలి బ్రదర్స్ ను దగ్గరకు తీశారు. గాలి ఇంట జరిగే ప్రతి కార్యక్రమానికి ఆయన హాజరై తన ఆశీస్సులు వారికి ఉన్నాయని పదే పదే చెప్పారు.తాజాగా గాలి జనార్థన్ రెడ్డి ఇరుక్కున్న కేసు మరింత కమలం పార్టీని ఇరుకున పెట్టేదిలా ఉంది. మనీల్యాండరింగ్ కేసులో ఉండటం, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారికి లంచం ఇచ్చిన కేసులో గాలి మరోసారి అరెస్ట్ కాక తప్పదు. అయితే గాలి జనార్థన్ రెడ్డి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా బీజేపీ పక్షాన ప్రచారం నిర్వహించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన బళ్లారిలో అడుగుపెట్టలేదు కాని, మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్ధులను ఆయన అన్ని రకాలుగా ఆదుకున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల్లో సయితం గాలి జనార్థన్ రెడ్డి లోపాయికారీగా బీజేపీ అభ్యర్థి, శ్రీరాములు సోదరి శాంతకు సహకరించినట్లు అందరికీ తెలిసిందే. ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత గాలి మరో కేసులో ఇరుక్కోవడంతో ఇక వీలయినంత దూరం పాటించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. దీనివల్ల పార్టీ పై చెడు అభిప్రాయం కలుగుతుందని, గాలిని ఇక వదిలేమయని ఢిల్లీ నుంచి రాష్ట్ర పార్టీ నేతలతో పాటు బళ్లారి బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. మొత్తం మీద బీజేపీలో ఇక గాలి మాట వినపడకూడదన్న ఆదేశాలు ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి.

Related Posts