మధ్యప్రదేశ్లో తిరిగి బీజేపీ అధికారంలోకి రావాలంటే నగర, పట్ణణాల్లోని నియోజకవర్గాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే పట్టణాలు బీజేపీకి పెట్టని కోటలుగా ఉన్నాయి. ఈ పట్టును కోల్పోకుండా ఉండేందుకు కమలం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. వాస్తవానికి మధ్యప్రదేశ్ అనేగాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పట్టణాలు, నగరాల్లోనే బీజేపీవైపు మొగ్గు ఉంది. ఇది అనేక సందర్భాల్లోనూ నిరూపితమైంది. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే.. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 36 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో 70 శాతం అంటే 30 స్థానాల్లో బీజేపీ సిట్టింగ్లు ఉన్నారు. మిగతా పది స్థానాల్లో ఆరింటిలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ.. పట్టణ ఓటర్లపై ఉన్న పట్టును ఏమాత్రం చెక్కుచెదరనీయకుండా చూస్తోంది. ఇందులో భాగగా గల్లీస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. పట్టణాల అభివృద్ధికి, ఆ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నామో వివరిస్తోంది. ముఖ్యంగా గత ఏడాది గుజరాత్ అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణాలు, నగరాల్లోనే బీజేపీ మంచి ఆదరణ లభించింది. ఒక విధంగా గుజరాత్లో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టేందుకు పట్టణాలు, నగరాల ఓటర్లే దోహదపడ్డారు. ఇదే వ్యూహాన్ని మధ్యప్రదేశ్లనూ అనుసరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కు ఆదరణ పెరుగుతోందన్న విషయాన్ని గమనించే కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిని నగరాల్లో పట్టు ఏమాత్రం సడలకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నగరాల్లోనే 36 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, వాటిలో గెలిస్తే పార్టీ గెలుపు సునాయాసమవుతుందని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.