ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి మంత్రివర్గవిస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెడీ అయిపోయారు. మరికొద్దిసేపట్లో మంత్రివర్గ విస్తరణపై సీనియర్ నేతలు, మంత్రులతో చర్చించనున్నారు. ఈ విస్తరణలో కేవలం ఇద్దరికి మాత్రమే చోటుంటుందని తెలిసింది. ప్రస్తుతం మండలి ఛైర్మన్ గా ఉన్న ఫరూక్ కు స్థానం కల్పించనున్నారు. అలాగే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్ కు కూడా స్థానం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు అధికార నివాసంలో ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. అయితే ఈసందర్భంగా కొన్ని శాఖల మార్పులు కూడా చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రధానంగా కామినేని శ్రీనివాస్ రాజీనామా చేసిన తర్వాత కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి తన వద్దనే ఉంచుకున్నారు. ఈ శాఖ సీనియర్లకు అప్పగిస్తారా? లేక ఫరూక్ కు కేటాయిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.మరోవైపు ఫరూక్ ను మంత్రి వర్గంలో తీసుకుంటే మండలి ఛైర్మన్ పదవిని కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఈ పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించారు. అలాగే విస్తరణలో మంత్రి పదవిని ఆశించిన వారిని కూడా బుజ్జగించనున్నారు. కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి వచ్చారు. ఆయన మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కానీ గవర్నర్ తో సత్సంబంధాలు లేకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వకూడదని, ఒకవేళ ఇచ్చినా గవర్నర్ కొర్రీలు వేసే ప్రమాదముందని చాంద్ భాషా ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.