కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి అజ్ఞాతం వీడారు. తాను ఎక్కడికి పారిపోలేదు.. బెంగళూరులో ఉన్నానంటూ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘నేను ఎక్కడికీ వెళ్లలేదు.. బెంగళూరులో ఉన్నాను. శనివారం సాయంత్రంలోపు బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరవుతాను. బళ్లారిలోని నా ఇంటి దగ్గర భయానక వాతావరణాన్ని సృష్టించారు. నాపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు.. నేను ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు అందుకోలేదన్నారు. జనార్దన్ రెడ్డి ఈ వీడియోను ఓ రహస్య ప్రాంతంలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటూ లాయర్ కూడా వెంట ఉన్నారు. సాయంత్రంలోపు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వస్తానని చెప్పడంతో.. అక్కడ పోలీసుల్ని భారీగా మోహరించారు. లాయర్‌తో కలిసి విచారణకు హాజరవుతారని అధికారులు చెబుతున్నారు. గాలిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉదయం గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా.. అప్పటికే ఆయన పారిపోయినట్లు తెలిసింది. సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన బెంగళూరు సీసీబీ పోలీసులు ఆయన కోసం గాలించినా ఆచూకీ దొరకలేదు. స్పెషల్ టీమ్‌లతో గాలించాన ఫలితం లేకుండా పోయింది. బెంగళూరుకు చెందిన అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన కేసు విషయంలో ఈడీ అధికారికి గాలి జనార్దన్ రెడ్డి రూ. కోటి లంచం ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించడానికి పోలీసులు యత్నిస్తున్నారు.