.jpg)
పంచ చామరం: ఇ టా చతుర్ముఖుండ రాగఁ నిష్ట శిష్టపాళితోఁ
దటాలున న్మునిప్రభుండు తద్దభక్తి యుక్తిమై
నిటాలమందుఁ గేలుదోయి నిల్చి మ్రొక్కి నిల్చితా
ని టేటికో ననుం గనంగ నేగుదెంచె ధాతయున్-2.
పంచ చామరం వృత్తానికి జ-ర-జ-ర-జ-గ గణాలు. పదో అక్షరం యతి. చతుర్ముఖ బ్రహ్మకు పంచ చామర సేవ చేశారు వాసు దాసుగారు.
రామాయణాన్ని రచించేందుకు వాల్మీకిని నియమించడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆయన ఆశ్రమానికి వస్తాడు. అప్పటికే జంటగా పక్షులు కలిసున్న సమయంలో, ఒక దాన్ని కొట్టి చంపడం ధర్మం కాదని నిశ్చయించుకున్న వాల్మీకి ఆ పనిచేసిన బోయవాడిని శపించాడు. శపించిన మాటలే పద్య రూపంలో కావడం అర్థంకాని వాల్మీకి నోట వచ్చిన పద్యానికి కారణం తానేనని తెలియక తికమక పడుతున్నాడని తెలిసిన బ్రహ్మ, అది యాదృచ్ఛికంగా వచ్చింది కాదని, తన పనుపున సరస్వతీ దేవి వాల్మీకి నోటినుండి పలికించిందని అంటూ, రామాయణాన్ని కావ్యంగా రచించి, భూ లోకంలో దాన్ని ప్రచారంలోకి తెమ్మని చెప్పి వెళ్లిపోయాడు. తాను రచించాలని నిర్ణయించుకున్న రామాయణం రసవంతంగా, వినడానికింపుగా, మననం చేయడానికి అమృత సమానంగా, రహస్యార్థాలకు ఆధారంగా, పఠించేవారికి-వినే వారికి నిర్మలమైన కీర్తినిచ్చేదిగా, భగవత్ ప్రాప్తికి విరుద్ధమైన పాపాలను హరించేదిగా వుండాలనుకుంటాడు మహర్షి. ఎలావుండాలో చెప్పడానికి వాసు దాసుగారు "కవిరాజ విరాజితము" లో పద్యాన్ని రాసారు ఈ విధంగా:
కవిరాజ విరాజితము: సరససమాసవిలాసవిభాసము సాధునుతంబు సుసంధిగమున్
వరమ ధురోపనతార్థ సువాక్యని బద్ధము యోగసమంజసము
న్ఖరదశకంఠవధాధికమున్ సుమ నస్సు ఖదంబు మునీరితమున్
స్ఫురదురుసద్గుణభూషణభూషిత మున్ గనుఁ డీ రఘురాము కథన్-3
కవిరాజ విరాజితము ఛందస్సు: "నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము". దీనికి ఒక సిద్ధాంతం ప్రకారం 8-7-7 స్థానాలలోనూ, ఇంకో సిద్ధాంతం ప్రకారం 14వ స్థానంలోనూ యతి వుంటుంది. ఈ పద్యంలో యతి రెండో సిద్ధాంతాన్ని అనుసరించి రాయబడింది.
తాత్పర్యం: రసవత్తరమైన సమాసాలతో, సుకరమైన సంధులతో ప్రకాశించేదిగా-సజ్జనులతో స్తోత్రం చేయబడేదిగా-సమత్వం, మాధుర్యం,అర్థ వ్యక్తి లాంటి గుణాలు కల బోసి వాక్య బద్ధమైన కావ్యంగా-యోగం, రూఢ్యర్థాలతో కూడినదిగా-రావణాసురుడి వధను అధికరించి చెప్పేదిగా-మనస్సుకు సుఖమిచ్చేదిగా-పామర కవులకు బదులుగా మునీశ్వరుడు చెప్పిందిగా-చక్కటి కావ్య గుణాలతో అలంకరించినది గా, తాను రచించ బోయే రామాయణాన్ని-అందులోని శ్రీరామ చరిత్రను దర్శన సమానమైన ధ్యానంతో శ్రద్ధగా లోకులందరినీ వినమని కోరతాడు వాల్మీకి.
విలక్షణమైన ప్రబంధ గ్రంథమే రామాయణ కథనం అని అంటూ ఆ విషయాలను సోదాహరణంగా వివరిస్తారు వాసు దాసుగారు. లోక రక్షణ కొరకు భూమ్మీద అవతరించిన శ్రీరామచంద్రమూర్తి ప్రజా పాలన చేస్తున్న రోజుల్లో, భగవంతుడైన వాల్మీకి మహర్షి, లోకోపకారంగా, చిత్రమైన పదాలతో, ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణ రచన చేశాడు. పూర్వ రామాయణంలోని ఆరు కాండలలో ౫౩౭ (537) సర్గలుంటే, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత జరిగిన కథకు సంబంధించిన ఉత్తర కాండలో మరో ౧౧౦ (110) సర్గలున్నాయి. అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఈ గ్రంథాన్ని లోకానికి ప్రకటించినవారు కుశ లవులు.
సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు
బాల కాండ ౭౭ (77) సర్గలు ౨౨౫౬ (2256) శ్లోకాలు
అయోధ్య కాండ ౧౧౯ (119) సర్గలు ౪౪౧౫ (4415) శ్లోకాలు
అరణ్య కాండ ౭౫ (75) సర్గలు ౨౭౩౨ (2732) శ్లోకాలు
కిష్కింధ కాండ ౬౭ (67) సర్గలు ౨౬౨౦ (2620) శ్లోకాలు
సుందర కాండ ౬౮ (68) సర్గలు ౩౦౦౬ (3006) శ్లోకాలు
యుద్ధ కాండ ౧౩౧ (131) సర్గలు ౫౯౯౦ (5990) శ్లోకాలు
ఉత్తర కాండ ౧౧౦ (110) సర్గలు ౩౨౩౪ (3234) శ్లోకాలు
--------------------------------------------------------------------------------
ఏడు కాండలు ౬౪౭ (647) సర్గలు ౨౪,౨౫౩ (24,253) శ్లోకాలు
--------------------------------------------------------------------------------
స్థూల దృష్టితో పెద్ద సంఖ్య చెప్పేటప్పుడు దాని పైనున్న చిల్లర సంఖ్య గణించాల్సిన పనిలేదు. అందుకే రామాయణంలో ౨౪ (24) వేల శ్లోకాలని చెప్పడం జరిగింది. ప్రబంధ వైలక్షణ్యాన్ని తెలియచేసే సర్గ ఇది. పరమ ఆప్తుడైన కవి రచించడం, కీర్తిమంతుడైన నాయకుడు ప్రతిపాద్యుడిగా వుండడం, మహాత్ములు దాన్ని అంగీకరించడం, సాక్షాత్తూ కథానాయకుడే దాన్ని శ్లాఘించడం లాంటి విషయాలను కలిగున్న గ్రంథాన్ని "ప్రబంధ వైలక్షణ్య" మున్న గ్రంథ మంటారు. సర్గలోని మొదటి పద్యంలోనే ఈ విషయం విశదమవుతుంది. సమస్త సద్గుణాలతో లోకులందరినీ ఆనందపర్చిన శ్రీరామచంద్రుడి చరిత్రై నందువల్ల, రామాయణం కడు ఆదరణీయమైంది. శ్రీరామ చరిత్ర అంటే మహాపురుష చరిత్రే.. అందుకే దీనివలన ఎన్నో లాభాలున్నాయన్న భావన కూడా మొదటి పద్యం లోనే వివరించబడింది. శ్రీరామచంద్రమూర్తి రాజ్యం చేసే రోజుల్లో, సీతాదేవి తన ఆశ్రమం చేరిన తర్వాతే, వాల్మీకి రామాయణ రచన చేశారన్న విషయం కూడా ఈ పద్యంలో స్పష్టంగా బోధపడ్తుంది. శ్రీరామచంద్రమూర్తి అవతరించడానికి పూర్వమే వాల్మీకి రామాయణం రచించాడనడం సత్యదూరం. రామాయణంలోని శ్లోకాలు, సర్గలు, కాండల వివరాలు కూడా మొదటి పద్యంలో చెప్పడం జరిగింది.
ఆ మొదటి పద్యం ఇదే:
సీ: భువనావనార్థంబు భూమిపై జన్మించి, ప్రాప్తరాజ్యుండయి ప్రజలరాము
డోముచు నుండ లోకోపకారంబుగ, భగవంతు డగు ఋషి వాల్మికుండు
శ్రీరాము చరితంబు చిత్రపదంబుల, వెలయ నిర్వదినాల్గు వేలు శ్లోక
సంఖ్యయు, వానిని సర్గముల్ గాగను, పూర్వరామాయణ మనను నూరు
తే: లేను, కాండంబులారుగ జానుమీర, వెండియునుబల్కె బదపడి కాండమొండు
పావనంబై న రఘురాము భావికథను, సో త్తరంబుగ నెల్ల రసోత్తరముగ.
ముని కుమారులవలె కనిపిస్తున్న కుశ లవులు ఎంతో సమర్థతతో, వాల్మీకి నేర్పిన విధంగానే, రామాయణాన్నంతా ముఖస్థం చేశారు. అయోధ్యకు పోయి, ప్రశస్త రీతిలో, కడు సంతోషంతో, మహర్షులు-సాదువులు-బ్రాహ్మణులున్న పెద్ద సభా మండపంలో ధర్మ సమ్మతమైన కావ్యాన్ని గానం చేయసాగారు. గుంపులు-గుంపులుగా జనాలున్న చోట, చిన్న-చిన్న వీధుల్లో, సందుల్లో-గొందుల్లో, రచ్చ బండల దగ్గర, అంగడి వీధుల్లో, సంతోషంగా పాడారు కుశ లవులు. వివిధ రకాల అభినయాలతో, నవ రసాల పలుకులతో కుశ లవులు గానం చేస్తుంటే, సంతోష సాగరంలో మునిగి తేలుతున్న జనావళి, వళ్లు మరిచి, వారిని భళీ-భళీ అని మెచ్చుకున్నారు.
అయోధ్య వీధుల్లో రామాయణ గానం చేస్తున్న కుశలవులను శ్రీరాముడు తన వద్దకు పిలిపించుకుంటాడు. మన్మధాకారంతో ముని వేషధారులైన కుశ లవులిద్దరు, ఒకే రకంగా వున్న విషయాన్ని - వారిని చూడగానే సమస్త విద్యలను సరిసమానంగా నేర్చుకున్నట్లుగా తెలుస్తున్న విషయాన్ని, శ్రీరామచంద్రుడు గమనించి, తన మనసులో అనుకుంటున్న దాన్ని తమ్ములతో ప్రస్తావిస్తాడు. తేనెలొలికే అందం తోనూ, అమృత రస ప్రవాహంలోని అలల లాగానూ, వేదార్థంలోని సదభిప్రాయం తోనూ, వింటున్న కొద్దీ బ్రహ్మానందం కలిగించే విధంగా కుశ లవులిద్దరు గానం చేస్తున్నారని అంటాడు. కుశలవుల గానాన్ని వినమని తమ్ముళ్లను ప్రోత్సహిస్తూ: "ఈ బాలకులు ఏ రసాన్నైతే అభినయిస్తూ పాడుతున్నారో, ఆ రసమే మనలో పుట్టి మనకూ అనుభవంలోకి వస్తున్నది. కవిత్వం విషయానికొస్తే, ఆసాంతం, విచిత్ర శబ్దాలతో కూడి వినసొంపుగావుంది. ఏ దోషాలు లేవు. ఇలాంటి నిర్దుష్టమైన-గుణవంతమైన-శ్లాఘ్యమైన కావ్యాన్ని చంద్ర బింబం లాంటి ఈ ముని కుమారులు గానం చేస్తున్నారు" అని సగౌరవంగా మాటలతోనే బహుకరిస్తూ అంటాడు శ్రీరాముడు.
ఈ సందర్భంలో వాసు దాసు గారు రాసిన ఉత్పలమాల పద్యానికి సంబంధించిన ఛందస్సు గురించి ఆయనే స్వయంగా కొన్ని వ్యాకరణ విషయాలను ప్రామాణికంగా ఉదహరిస్తారు. ఆయన రాసిన ఆపద్యం:
ఉత్పలమాల: సోదరులార వింటిరె ర సోదయకారణ మై విచిత్ర శ
బ్దాదరణీయ మై విమల మై చెలువారెడుకావ్య మిందిరా
సోదరమూర్తు లీతపసి సూనులు గాన మొనర్ప నద్ధిరా
మాదిరి మీరె నంచు బహు మానపురస్కృతవాక్కు లాడినన్
ఛందస్సు: మూడోపాదంలో "అఖండయతి" వాడబడింది. ఈ యతి విషయంలో భిన్నాభిప్రాయాలు వున్నాయని కవి అంటూ, "అఖండ యతి" ని అంగీకరించిన వారి పక్షాన తానున్నానని స్పష్టం చేశారు. అఖండ యతి సిద్ధాంతాన్ని నిరాకరించిన వారు లక్షణ-లక్ష్యాలను శోధించలేదని, భారాతాన్నైనా పూర్తిగా చదవలేదని ఆక్షేపించారు కవి. పూర్వ గ్రంథాలనుండి కొన్ని ఉదాహరణలిస్తూ, భీమకవి పేర్కొన్న పది యతులలో అఖండ యతి కూడా వుందని అంటారు. అప్పకవికి పూర్వులు, భీమకవికి ముందున్న కవులు ఎలా అఖండ యతిని ఆదరించారో సోదాహరణంగా పేర్కొన్నారు వాసు దాసుగారు.
రతీదేవిని మించిన సుందరమైన భార్యలు-అసమాన పరాక్రమం వున్నా, సంతానం లేనందున, సుఖాలెన్ని వున్నా-కుమారులవలన కలిగే భోగ భాగ్యాలతో సరితూగవని-తన తపస్సు వ్యర్థమనీ బాధపడేవాడు దశరథుడు. పుత్రులు కలిగేందుకు అశ్వమేథ యాగం చేస్తాననీ-అలా చేస్తే సంతానం కలగొచ్చనీ తన మంత్రులతో పురోహితులతో అంటాడు. అందులో భాగంగా పుత్రకామేష్టి యాగం కూడా చేయాలనుకుంటాడు.
పుత్ర కామేష్టి యాగం చేయ సంకల్పించిన దశరథుడితో ముఖ్యమంత్రి సుమంత్రుడు తనకు తెలిసిన ఒక ఉపాయాన్ని-దేన్నైతే సనత్కుమారుడు ఋషులందరూ వింటుండగా వెల్లడిచేశాడని వశిష్ఠాది మునులంటుండగా తాను విన్నాడో, దాన్ని చెపుతానని అంటాడు. ఆ ఉపాయంతో, పుత్రులు లేరన్న చింత తొలగిపోతుందని, అది పుత్రులు కలిగేందుకు నిర్విఘ్నమైన ఉపాయమని అంటాడు. కాశ్యపుడు అనే మునికి-హరిణిలకీ గొప్ప తపస్వి-పుణ్యవంతుడైన ఋశ్యశృంగుడనే కొడుకున్నాడనీ, అతడు పుట్టినప్పటినుండీ అడవుల్లోనే విహరించేవాడని సుమంత్రుడంటాడు. అడవుల్లో తిరిగే అతడు తన తండ్రిని చూడడానికి వచ్చే మునులను తప్ప ఇంకెవ్వరినీ చూడలేదు. ఎల్ల వేళలా తండ్రి ఆజ్ఞానుసారం తపస్సు చేస్తుండేవాడు. ఈ విషయాలను చెప్తూ బ్రహ్మచర్యం గురించి కూడా వివరిస్తాడు సుమంత్రుడు దశరథుడికి. ఇక్కడో పద్యాన్ని "తరలము" వృత్తంలో రాసారీవిధంగా:
తరలము: జననమాది రసాస్థలిన్ వన చారియై సతతంబు నా
మునివరేణ్యుఁ డు గానఁ దండ్రికి మ్రొక్క వచ్చెడియోగులన్
ఘనతపస్వులఁ గాని యన్యముఁ గానఁ డెద్దియు, నిత్య మ
య్యనఘుఁ డుగ్రతపంబులన్ జన కాజ్ఞచొప్పున వర్తిలున్-4
ఛందస్సు: న-భ-ర-స-జ-జ-గ గణాలు. పన్నెండో స్థానంలో యతి.
ఋశ్యశృంగుడి చరిత్రను సవివరంగా చెప్పమని కోరిన దశరథుడితో, సుమంత్రుడు, ఇంతకుముందు చెప్పినదాన్నే మరింత సమగ్రంగా తెలియచేస్తాడు. ఆ సందర్భంలో "మత్తకోకిలము" వృత్తంలో ఒక పద్యాన్ని, "తరలము" లో ఇంకొక పద్యాన్ని రాస్తారు. అవి:
మత్తకోకిలము: ఆ ఋషీంద్రుఁ డు పుట్టు వాదిగ నంబుజాయతనేత్ర ల
న్వార లెట్టిరొ యాలకింపఁ డు పల్క నేటికిఁ జూచుటల్
వారముఖ్యులు ధారణీశ్వర వంచనాపర లౌటచే
నేరుపుల్ పచరించి తేరఁ గ నేర్తు రెంతయుఁ దిన్నఁ గన్-5
తరలము: జనన మందిన దాదిఁ గా బుర సంభవంబు నేదేనియున్
జనపదోద్భవమైనఁ జూచిన జాడ లేదు, నెలంత ల
న్వినియు నేని నెఋంగఁ, డుగ్రసు నిష్ఠు డౌటఁ దపంబునన్
దనదునాశ్రమ భూమి వీడఁడు దండ్రిఁ దన్పు సపర్యలన్-6
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి. తరలము నకు న-భ-ర-స-జ-జ-గ గణాలు. పన్నెండో స్థానంలో యతి.
తాత్పర్యం: పుట్టినప్పటినుండి ఇంతవరకూ స్త్రీలను ఋశ్యశృంగుడు చూడలేదు కనుక, వారెలా వుంటారో ఎరుగడని-అందువల్ల ఆయనను తీసుకునిరాగలిగేది స్త్రీలేనని మంత్రులంటారు. కుల కాంతలకు బదులు వార కాంతలైతే, ఏదో విధంగా వంచనతో వశపర్చుకుని, ఋశ్యశృంగుడిని తీసుకుని రాగలుగుతారని-ఈ పనికి వారినే పంపిద్దామని సలహా ఇస్తారు మంత్రులు. నగరంలోగాని-పల్లెల్లోగాని అందరికీ కనిపించే ఏ వస్తువునూ పుట్టినప్పటినుండి చూసినవాడు కాదు ఋశ్యశృంగుడు. స్త్రీలెలా వుంటారో అసలే తెలియదు. నియమ నిష్ఠలతో తపస్సు చేయడంలోనో-విరామం దొరికినప్పుడు తండ్రికి సేవలు చేయడంలోనో మాత్రమే సమయాన్ని గడిపేవాడు ఋశ్యశృంగుడు. ఆశ్రమాన్ని విడిచి ఎప్పుడూ-ఎక్కడకూ పోయినవాడు కాదాయన. ఇతిహాసాలు-పురాణాలు చదివి, స్త్రీలు ఎలా వుంటారోనని చదివిన వాడూ కాదు. అలాంటి ఋశ్యశృంగుడి దగ్గరికి వెళ్లాలంటే, అక్కడున్న విభండకుడు శపిస్తాడన్న భయంతో, వార కాంతలు చాలా దూరంలో వుండే, సరైన సమయం కొరకు ఎదురు చూశారు.
సుమంత్రుడి సలహా విన్న దశరథుడు, వశిష్ఠుడికి విషయాన్నంతా తెలియపరచి, ఆయన సూచన ప్రకారం ఋశ్యశృంగుడిని తన రాజ్యానికి తీసుకొచ్చేందుకు రోమపాదుడి దగ్గరకు పోతాడు. ఆయన పయనమై పోతున్న త్రోవను వర్ణిస్తూ "ప్రహరణకలిత" వృత్తంలో ఒక పద్యం రాసారు వాసు దాసుగారీవిధంగా:
ప్రహరణకలిత: వనములు నదులున్ వరుసగఁ గనుచున్
జనపతి చనెఁ ది న్న నిపయనములన్
మునికులతిలకున్ మును చని కనెఁ బా
వనశుచిరుచిన్ వరఋషి తనయున్-7
ఛందస్సు: "ప్రహరణకలిత" వృత్తానికి న-న-భ-న-వ గణాలుంటాయి. ఎనిమిదో అక్షరం యతి.
తాత్పర్యం: దారిలో నదులను-పర్వతాలను దాటుకుంటూ, రోమపాదుడి చంపా నగరానికి చేరుకుంటారు. వెళ్లిన వెంటనే, ముందుగా ఋశ్యశృంగుడి దర్శనం చేసుకుని, తర్వాత రోమపాదుడి వద్దకు వెళ్తాడు దశరథుడు.
సంతాన లాభం అనుగ్రహించమని దశరథుడు యజ్ఞం చేస్తున్న సమయంలో, అక్కడకు, గంధర్వులు-దేవతలు-సిద్ధులు-ఇతర దేవతలు, పరమ ఋషులు, తమ తమ హవిర్భావం కొరకై బ్రహ్మదేవుడితో కలిసి వచ్చారు. వచ్చిన వారంతా బ్రహ్మను చూసి, రావణాసురుడు తమను పెట్తున్న బాధలను ఆయనకు మొర పెట్టుకుంటారు. దశరథుడి అభీష్ఠాన్ని నెరవేర్చేందుకు, పరమ కరుణాలుడైన భగవంతుడు భూలోకంలో అవతరించదలచి దేవతలున్నచోటికే వచ్చాడు ఆ సమయంలో. వచ్చిన విష్ణుమూర్తి ఏకాగ్రమనస్సుతో బ్రహ్మ సమీపంలో వుండగా, దేవతలాయనకు నమస్కరించి, స్త్రోత్రం చేసి, ఆయన మనస్సును సంతోష పరిచి, భక్తితో తమ బాధలు చెప్పుకున్న విషయాన్ని "సుగంధి" పద్యంలో రాసారు కవి ఇలా:
సుగంధి: నిన్ను వేఁడు వార మయ్య నీరజాక్ష! మమ్ము నా
పన్నులం బ్రపన్ను లం బ్రపంచము న్దయామతిం
జెన్ను మీరఁ గావవే, ప్రసిద్ధుఁ డిద్ధకీర్తిసం
పన్నుఁ డున్ వదాన్యుఁ డుం దపస్వితుల్య తేజుఁ డున్-8
ఛందస్సు: సుగంధికి ర-జ-ర-జ-ర గణాలు 9 వ అక్షరం యతి.
తాత్పర్యం: కమలాలలాంటి కళ్ళున్న మహానుభావా! ఆపదలతో బాధపడుతున్నాం. నిన్ను ప్రపత్తి చేసినవాళ్ళం. అందుకే నిన్నే ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని-ప్రపంచాన్ని దయతో రక్షించు. ప్రపంచంలో సత్ప్రవర్తనకలవాడని ప్రసిద్ధికన్నవాడు, మంచి కీర్తి సంపాదించినవాడు, దాత, ఋషితేజంకలవాడు, కకుత్థ్స వంశంలో పుట్టినవారిలో శ్రేష్ఠుడు దశరథుడు కొడుకులు కావాలని సంకల్పించి యజ్ఞం చేస్తున్నాడు.
రావణుడు వర గర్వంతో అన్ని లోకాలవారిని-ముఖ్యంగా వయసులో వున్న స్త్రీల మాన ప్రాణాలను-పురుషుల ప్రాణాలను నాశనం చేసాడని, వాడు మనిషి చేతులో తప్ప ఇతరుల వల్ల చావడని, సామాన్య మానవులెవరు వాడిని చంపలేరని, అందువల్ల విష్ణుమూర్తే మానవావతారంలో వాడిని చంపాలని దేవతలిచ్చిన సలహాను అంగీకరించిన మహావిష్ణువు దశరథుడు పుత్ర కామేష్ఠి యాగం చేస్తున్న ప్రదేశం నుండి అదృశ్యమయ్యాడు. విష్ణుమూర్తి యజ్ఞ సభనుండి అంతర్థానమైన తర్వాత ఆయనకు రామావతారంలో సహాయపడేందుకు, బలవంతులను - కామ రూపులను- గోళ్ళు, కోరలు ఆయుధాలుగా కలవారిని-అసహాయశూరులను సృజించమని, దేవతలను ఆదేశిస్తాడు బ్రహ్మ. ఇలా జన్మించిన వానరుల విషయం ప్రస్తావిస్తూ ఒక పద్యాన్ని "ఉత్సాహం" లోనూ, మరొకటి "మత్తకోకిలము" వృత్తంలోనూ, మూడోది "మనోహరిణి" వృత్తంలోనూ రాసారీవిధంగా కవి.
ఉత్సాహం: కామరూపధారులుం బ్ర కాశమాన తేజులున్
ధీమతుల్ ప్రధాయుతుల్ సుధీరతావిరాజియుల్
భీమవేగభూరిశౌర్య విక్రమేడ్యయూథపుల్
భూమిశతసహస్రశతము పుట్టి క్రాలు చుండఁ గన్-9
ఛందస్సు: ఉత్సాహం కు ఏడు సూర్య గణాలు, ఒక గురువు, ఐదవ గణం మొదటి అక్షరం యతి.
మత్తకోకిలము: అట్టిమర్కటయూథపాళుల యందు మిక్కిలి మేటులై
దిట్టలై రవిపుత్రుఁ డాదిగ దేజరి ల్లిరి యూథనా
థేట్టు లీ ప్లవగేంద్రులున్ జని యింపఁ జేసిరి ధీరతా
పట్టభద్రుల శౌర్య రుద్రుల స్వామికార్యవినిద్రులన్-10
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.
మనోహరిణి: జలధర బృందా చలకూటనిభుల్
బలమదవంతుల్ ప్లవగ ప్రముఖుల్
వెలసిరి సీతా విభుసాహ్యముకై
బలకొని చక్షు ర్భయదాకృతులున్-11
తాత్పర్యం: వారు కోరిన రూపాలు ధరించగలరు.తేజంతో ప్రకాశిస్తూ-బుద్ధివల్ల పూజించబడుతూ కీర్తిమంతులుగా-మంచి ధైర్యవంతులుగా-భయంకర వేగంతో- గొప్ప శౌర్యంతో-పరాక్రమంతో ఆ వానర సేనానాయకులందరూ భూమిపై తిరగసాగారు. ఆ సేనానాయకుల గుంపులలో,మిక్కిలి గొప్పవారైన సుగ్రీవుడులాంటివారు,వారికి నాయకుడై వుండసాగారు.ఈ వానరులకు కూడా ధైర్యవంతులు, శౌర్యవంతులు, స్వామికార్యధురీణులు పుట్టారు. మేఘ సమూహాలవలె బలసినవారై, కొండ శిఖరాలలాగా ఉన్నత దేహాలు కలిగి, బల గర్వాలతో, భయంకర ఆకారాలతో, శ్రీరాముడికి సహాయం చేసేందుకొరకు జన్మించారా వానర శ్రేష్ఠులు.
యజ్ఞం అయిన ఆరు ఋతువుల తర్వాత, పన్నెండో నెలలో, చైత్ర మాసం - శుక్లపక్షం - నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, అభిజిల్లగ్నం - కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయం (గురుడు కర్కాటకరాశిలో చంద్రుడితో చేరి వుండడం - చైత్రంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం కూడా ఉచ్ఛస్తానాలే), సూర్యుడితో సహా ఐదు గ్రహాలు (అంగారక, సూర్య, గురు, శని, శుక్ర) వాటి-వాటి ఉచ్ఛ స్థలాల్లో(సూర్యుడికి మేషరాశి - గురువుకు కర్కాటకం - శనికి తుల - శుక్రుడికి మీన రాశి - అంగారకుడికి మకర రాశి ఉచ్ఛస్తానాలు) వుండగా, కౌసల్యా దేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క అర్థాంశమూర్తి - శుభ లక్షణాలు కలవాడైన రఘువంశ వర్ధనుడిని, సర్వ లోకాలు నమస్కారం చేసేవాడిని, రాముడిని కనింది.
శ్రీరాముడితో సహా నలుగురు రాజకుమారులు అల్లారుముద్దుగా పెరుగుతూ, విద్యలలో ఆసక్తిగలిగి, సమస్త విద్యలను శ్రేష్ఠులైన గురువుల దగ్గర నేర్చుకున్నారు. తన నలుగురు కుమారులకు వివాహం చేయాలని దశరథుడు ఆలోచన చేసే సమయంలో, ఆయన సంకల్పబలానికి అనుగుణంగానే, జగత్ప్రసిద్ధిగాంచిన - మహాతేజస్సుగల విశ్వామిత్ర మహర్షి ఆయనను చూడడానికి వచ్చాడు. యజ్ఞం చేద్దామని సంకల్పించుకొని దీక్ష పూనానని, దాన్ని విఘ్నం చేయాలని మారీచ - సుబాహువులు అనే ఇద్దరు రాక్షసులు పంతం పట్టారని, వారినుండి కాపాడేందుకు శ్రీరాముడిని తనవేంట అడవులకు పంపమని కోరాడు విశ్వామిత్రుడు. తనకిష్ఠం లేకున్నా, వశిష్ఠుడు చెప్పిందంతా విన్న దశరథుడు, సంతోషించి, లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని మునివెంట పంపేందుకు ఒప్పుకుంటాడు. బల-అతిబల విద్యలను నేర్చుకుంటారు రామలక్ష్మణులు.తాటక వధానంతరం యుద్ధభూమిలో జయించగల శ్రేష్ఠమైన అనేక అస్త్రాలను శ్రీరాముడికిచ్చి అవి ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నేర్పుతాడు (తనవెంట అడవుల్లో తీసుకెళ్తున్న) విశ్వామిత్రుడు. శ్రీరామచంద్రుడు సంతోషంతో వాటిని స్వీకరించి, విశ్వామిత్రుడికి నమస్కరించి ప్రయాణమై పోతూ, తనకున్న సందేహాలను ఆయన్నడిగి తీర్చుకుంటాడు. తాను ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి ఉపసంహరించాలంటే ఏం చేయాల్నో, వివరంగా చెప్పమని శ్రీరాముడు అడిగిన విషయాలన్నిటికీ వివరణ ఇచ్చాడు విశ్వామిత్రుడు. తదుపరి, విశ్వామిత్రుడి ఆజ్ఞ ప్రకారం సంహారాస్త్రాలన్ని రామచంద్రమూర్తి లక్ష్మణుడికి ఇచ్చాడు. ఈ విధంగా వారిద్దరూ ఆ విద్యలనన్నీ నేర్చినవారైనారు. విశ్వామిత్రుడి యాగరక్షణచేసిన రామలక్ష్మణులను మిథిలానగారనికి తీసుకొని పోతుంటాడు. రత్నాల లాగా శ్రేష్ఠమైన సద్గుణాలుగల ఆ బాలురు విశ్వామిత్రుడి వెంట పోయే సమయంలో సమీపంలోని కొండ పక్క అందమైన చెట్ల గుంపు కనిపించింది. ఆ సందర్భంలో "వనమయూరము" లో రాసారీ పద్యాన్ని:
వనమయూరము: మాణవకరత్నములు మౌనివరున్ వెంటన్
రాణమెయిఁ బోవునెడ రాముఁ డు మృదుశ్రీ
వాణి నిటు పల్కె ఋషి వర్య ! గిరిచెంతన్
బొణిమి నెసంగెఁ దరుపుంజ మది గంటే ? -12
ఛందస్సు: వనమయూరము నకు భ-జ-న-స-గగ లు గణాలు. తొమ్మిదింట యతి.
గంగ ఎందుకు భూలోకంలో ప్రవహించవలసి వచ్చిందో, దానికి కారణమేంటో చెప్పదల్చుకుని, రామ లక్ష్మణులతో సగరుడి వృత్తాంతాన్ని వివరించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు సగర చక్రవర్తి వృత్తాంతాన్ని చెప్తూ ఆయనకు యజ్ఞంచేయాలన్న ఆలోచన కలిగిందంటాడు. యజ్ఞం మధ్యలో ఇంద్రుడు రాక్షస వేషంలో వచ్చి,యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడు. దాన్ని వెతకడానికి వెళ్లిన సగరకుమారులు కపిలుడి కోపాగ్నిలో భస్మమై పోతారు. చనిపోయిన సగర పుత్రులు స్వర్గానికి పోవాలంటే గంగలో వారి బూడిదలను తడపాలి. ఆ వంశంలోని భగీరథుడు రాజర్షిగా వుండి, పిల్లలులేనివాడైనందున, రాజ్యాన్ని మంత్రుల పరంచేసి, పూర్వీకులెవరికీ సాధ్యపడని గంగను తెచ్చేందుకు గోకర్ణానికి తపస్సు చేసేందుకు పోతాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు, అసమానమైన తపస్సు చాలించి ఆయనకోరికేదో తనకు తెలియచేయమని భగీరథుడితో అంటాడు. భగీరథుడు, తనననుగ్రహించి సగరకుమారులందరికి తాను తర్పణాలు వదిలేటట్లు చేయమని, బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. గంగా తీర్థంతో తన తాతల బూడిద రాసులను తడిపితే వారందరు స్వర్గానికి పోతారని-అలా వరమివ్వమనీ, తనకు పుత్రులనిచ్చి ఇక్ష్వాకుల వంశాన్ని నిలబెట్టమనీ బ్రహ్మనడిగాడు భగీరథుడు. ఇది వివరించేందుకు "తోటకము" వృత్తంలో రాసారో పద్యాన్నిలా:
తోటకము: జగదీశ్వర నాకు బ్ర సన్నుఁ డవే
నొగినాతపమున్ ఫల యుక్తమయే
న్సగరాత్మజులందరు నావల నన్
వగదీరఁగఁ గాంత్రు నివాపములన్-13
ఛందస్సు: తోటక వృత్తానికి నాలుగు "స" గణాలు, తొమ్మిదో అక్షరం యతి.
మిధిలానగరానికి ప్రయాణం కొనసాగిస్తూ, విశ్వామిత్రుడు, శ్రీరామ లక్ష్మణులతో-ఋషీశ్వరులతో కలిసి, గంగ దాటి, ఉత్తరం వైపున్న ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ, ప్రాకారాలతో, కుల పర్వతాలను మించిన మేడల గుంపుల కాంతులతో, తియ్య మామిడి లాంటి ఫల వృక్షాలతో స్వర్గాన్నే మరిపిస్తున్న విషాల నగరంలోకి ప్రవేశించగానే, రాజకుమారుడైన రామచంద్రమూర్తి, మహాత్ముడైన విశ్వామిత్రుడితో, ఆ నగరాన్ని ఏలే రాజెవ్వరని-ఏ వంశం వాడని, అడిగాడు. సమాధానంగా మునీంద్రుడు ఆ కథంతా చెప్పాడు.
పాలసముద్రం చిలికి-అందులోంచి పుట్టిన అమృతాన్ని భుజించినట్లైతే, తమకు మరణముండదని-ముసలితనం రాదని ఆలోచించి, మందర పర్వతాన్ని కవ్వంగా-వాసుకు తాడుగా, పాలసముద్రాన్ని చిలకడం మొదలెట్టారు దేవదానవులు. అలా వారు వేయి సంవత్సరాలు చిలకగా, ఆ రాపిడిని సహించలేక, వాసుకి విషాన్ని కక్కాడు. ఆ వేడికి కొండ రాళ్లు పగలడంతో పాటు, భయంకరమైన హాలాహలం రాక్షసులను, దేవతలను భస్మం చేయసాగింది. అంతులేని తాపాన్ని కలిగిస్తున్న హాలాహలాన్ని విష్ణువు చెప్పినట్లే మింగి, విషాన్ని కంఠంలో ధరించాడు. దేవతలు తిరిగి పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందర పర్వతం పుటుక్కున మునిగింది సముద్రంలో. అది చూసిన దేవతలు, ప్రపంచాన్ని-ముఖ్యంగా తమను రక్షించే విష్ణుమూర్తిని, కొండ మునుగుతున్నదని-దాన్ని పైకెత్తి పట్టగల సమర్థుడు ఆయనేనని-ఆయనను సేవిస్తుండే వారు ఆపదల పాలవుతుంటే వూరకుండరాదని-ఆశ్రిత రక్షణ చేసి, తమను కాపాడమని ప్రార్థించారు. ఈ సందర్భంగా "మత్తకోకిలము" వృత్తంలో రాసారీపద్యాన్ని కవి.
మత్తకోకిలము: ఆ హరించి విషంబు నిట్లు పురారి యేగిన, దేవతల్
మొహరించి మరిన్ మధింపఁ గ మున్గెఁ గొండ పయోనిధిన్
బాహి యందు నుతించి రంతటఁ బంకజాక్షుని నీజగ
ద్వ్యూహరక్షకు నందు మాకును బూఁ ట వీవ కదా హరీ ! -14
రేపు తరువాయి భాగం..