- పౌరులు, సైనికులు సహా ఆరుకు చేరిన మృతుల సంఖ్య
ఆర్మీ క్యాంపుపై దాడి చేసి సైనికులను బలిగొన్న ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు జమ్మూకశ్మీర్‌లోని సంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై దాడి చేసి ఫ్యామిలీ క్వార్టర్స్‌లోకి ఉగ్రవాదులు చొరబడిన సంగతి తెలిసిందే. లోపలికి చొరబడిన ఉగ్రవాదులను హతమార్చేందుకు శనివారం ఉదయం నుంచి ఆర్మీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ ఆదివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఆర్మీ ఎదురుదాడిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా.. ఆదివారం నాటికి వారి సంఖ్య నాలుగుకు పెరిగింది.
కాగా, జైషే మహ్మద్ ఉగ్రవాదుల దాడుల్లో శనివారం నాటికి ఒక జేసీవో సహా ఇద్దరు సైనికులు మృతి చెందగా.. ఆ సంఖ్య ఆరుకు పెరిగింది. ఆదివారం ఉదయానికి మరో ముగ్గురు సైనికులు, ఓ పౌరుడు సహా నలుగురు మరణించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, ఆర్మీ క్వార్టర్స్ నుంచి ప్రజలను తరలిస్తున్నామని ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ చెప్పారు. క్వార్టర్లలో ఇంకా పలు కుటుంబాలు ఉన్నాయని, వారి భద్రతే ఆర్మీకి ప్రధాన బాధ్యత అని చెప్పారు. శుక్రవారం రాత్రి నుంచి కాల్పులు అయితే లేవని వివరించారు.