- షా పట్ల సంఘ్, బీజేపీ సీనియర్లకు అసంతృప్తి
- సంఘ్ పై పట్టుకు మోడీ దృష్టి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో అంతస్సంఘర్షణ సాగుతోంది. సంఘ్‌లో అత్యంత కీలకమైన కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను తనకు అత్యంత సన్నిహితుడైన దత్తాత్రేయ హొసబలేకు ఇప్పించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు. దీనిని ప్రస్తుత అధినేత మోహన్ భగవత్ సహా సంఘ్‌లో అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న సురేష్ భయ్యా జోషీనే నంబర్ టూగా కొనసాగించాలని భావిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తీరు పైనా సంఘ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయనను తప్పించి, సంఘ్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్లే నేతను ఎంపిక చేయాలని పార్టీపై ఒత్తిడి తెస్తోంది.
కీలకమైన హిందీ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ప్రధాని మోదీ సంఘ్‌పై పూర్తి పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. మార్చి నెలాఖర్లో సంఘ్ అఖిల్ భారతీయ ప్రతినిధి సభ సమావేశం నాగ్‌పూర్‌లో జరగబోతోంది. అందులో జరిగే మార్పుల్లో మోదీ సన్నిహితులు పలువురు ముఖ్య స్థానాలు అలంకరించే అవకాశాలున్నాయని అంటున్నారు. మోహన్ భగవత్ పదవికి కాల పరిమితి లేదు. సంఘ్‌లో ఆయనది గురుస్థానం. ఆయన తర్వాత నెంబర్ టూ స్థానంలో ఉన్న వ్యక్తి కార్యనిర్వాహక అధిపతి అవుతారు.
అన్ని వ్యవహారాలూ ఆయనే చూస్తారు. సురేష్ భయ్యా జోషి మార్చిలో రిటైర్ కావాలి. 70 ఏళ్లు పైబడ్డ సురేష్ జోషి ఈ మధ్యే మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దేశమంతా తిరగలేక పోతున్నారు. ఆయన వైదొలిగితే హొసబలేకే అవకాశం దక్కుతుంది. ఆయన మోదీకి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం జోషి కింద సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన- యూపీలో అభ్యర్థుల ఎంపిక నుంచి బూత్ స్థాయి పోల్ మేనేజ్‌మెంట్ దాకా ఒంటిచేత్తో నడిపించారు.
ప్రస్తుత తరుణంలో ఆయన సంఘ్ కార్యాలయంలో కీలక స్థానంలో ఉండటం అవసరమని మోదీ భావిస్తున్నారు. మోహన్ భగవత్, సురేశ్ భయ్యా జోషి, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, ప్రవీణ్ తొగాడియా... ఇలా సంఘ్ పరివారంలో ముఖ్యులెవరికీ హొసబలే పదోన్నతి ఇష్టం లేదు. జోషికీ, మోదీకి మధ్య సఖ్యత లేదని పార్టీ వర్గాలంటున్నాయి. జోషి గనక రాజీనామా ఇవ్వకపోతే హొసబలే పదోన్నతికి ఆటంకాలు ఏర్పడవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 200-220 సీట్లు మించి రావని సంఘ్ అంచనా.
ఈ సమస్యను అధిగమించాలంటే హొసబలే సంఘ్‌ను నడిపించాలని మోదీ గట్టిగా భావిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో ముగుస్తుంది. ఆయన నేతృత్వంపై అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ సహా అనేకమంది బీజేపీ సీనియర్లకు చాలా అసంతృప్తి ఉంది. ఆయనను మార్చడమే మంచిదని సంఘ్, బీజేపీ సీనియర్లు భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ గెలిస్తే అమిత్‌షా గుజరాత్ ముఖ్యమంత్రిగానైనా వెళ్లిపోవచ్చు లేదా కేంద్రమంత్రి అయినా కావొచ్చు. అలాంటపుడు మోదీ తనకు విధేయుడైన మరో నేతను బీజేపీ సారథిగా నియమించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి షా పదవీకాలం ముగిసేలోగా ఎన్నికల ప్రక్రియ ముగించి, ఆయన్నే కొనసాగించాలనే ఆత్రంలో మోదీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.