ఏపీ రాజకీయాలన్నీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు నారాలోకేష్ చుట్టూనే తిరుగుతున్నాయి. లోకేష్ ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టక ముందు ఆయనపై ఎటువంటి ఆరోపణలు విపక్ష పార్టీలు చేయలేదు. నిజానికి లోకేష్ 2014 ఎన్నికలకు ముందునుంచే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత కూడా పార్టీలో ఆయన ప్రాధాన్యత పెరిగింది. సహజంగానే వారసుడు కావడంతో ఆయనకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి పదవి లభించింది. ఎప్పుడైతే మంత్రి పదవి చేపట్టారో అప్పటి నుంచే లోకేష్ పై అవినీతి ఆరోపణలు ముసురుకుంటున్నాయి. మంత్రి పదవి చేపట్టక ముందు కూడా కొన్ని ఆరోపణలు విన్పించినా అవి పెద్దగా హైలెట్ కాలేదు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కన్నా లోకేష్ నే టార్గెట్ చేశాయి విపక్షాలు. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లు తమ ప్రసంగాల్లో లోకేష్ ప్రస్తావన లేకుండా అస్సలు సాగడం లేదు. ఎక్కడకు వెళ్లినా లోకేష్ గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు జనసేనాని. అది ఇసుక తవ్వకాలు కావచ్చు. మైనింగ్ కార్యకలాపాలు కావచ్చు. పరిశ్రమల స్థాపన కావచ్చు. అంశం ఏదైనా సరే…అది లోకేష్ తోనే ముగుస్తుంది. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు మీద నేరుగా విపక్షాలు ఎప్పుడూ ఇలాంటి అవినీతి ఆరోపణలు చేయలేదు. ఆయన ఆ అవకాశం కూడా వారికి ఇవ్వలేదు.
లోకేష్ విషయంలో మాత్రం తరచూ పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. తాజాగా వంతాడ మైనింగ్ ప్రాంతాన్ని పర్యటించిన పవన్ కల్యాణ్ అక్కడ కూడా లోకేష్ పైనే గురిపెట్టారు. వంతాడలో మైనింగ్ కార్యకలాపాలు జరగడం కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇక్కడ మహేశ్వరి మినరల్స్ కు గనులను లీజుకిచ్చింది. అప్పట్లో విపక్షనేతగా ఉన్న చంద్రబాబునాయుడు సయితం ఇక్కడకు వచ్చి ఆందోళనకు చేశారు. మైనింగ్ కార్యక్రమాలను నిలిపేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మైనింగ్ లీజును మహేశ్వరి మినరల్స్ కు రద్దు చేసి, ఆండ్రూ మినరల్స్ కు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఆండ్రూ మినరల్స్ కు అప్పగించడం వెనక లోకేష్ హస్తం ఉందన్నది పవన్ ప్రధాన ఆరోపణ.ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ పవన్ వద్ద లేవు. ఉండే ఛాన్సు కూడా లేదు. జనవాక్యాన్నే జనసేనాని చెబుతున్నారన్నది ఆ పార్టీనేతలు అంటున్నారు. దీనిపై లోకేష్ ఫైర్ అవుతున్నారు. అవినీతి, ఆరోపణలు చేసేటప్పడు ఆధారాలుండాలంటున్నారు లోకేష్. ఆయన ట్విట్టర్ వేదికగా పవన్ చేస్తున్న విమర్శలకు సమాధానం చెబుతున్నప్పటికీ, పవన్ విమర్శలే ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు సమర్థుడని, విజన్ ఉన్న వ్యక్తి అని విపక్షాలు సయితం అంగీకరిస్తాయి. కానీ లోకేష్ విషయంలో మాత్రం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే విమర్శలు ఎదుర్కొంటుడటం ఆ పార్టీ నేతలకు మింగుడుపడలేదు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో చంద్రబాబు కంటే లోకేష్ మాత్రమే విపక్షాలకు టార్గెట్ అన్నది మాత్రం దాదాపుగా తేలిపోయింది. మరి లోకేష్ దీన్నుంచి ఎలా బయటపడతారో చూడాలి.