ప్రకాశం జిల్లా టీడీపీలో అప్పుడే టిక్కెట్ల సందడి మొదలైంది. ఆయా నియోజకవర్గాల నుంచి అధికార టీడీపీ టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాల్లో 3 రిజర్వుడనియోజకవర్గాలు కాగా, మిగిలిన 9 జనరల్ సీట్లుగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం చంద్రబాబు ఏపీలోని ఒకొక్క జిల్లా నుంచి టిక్కెట్ల కసరత్తులు ప్రారంభించేశారు. ఇప్పటికే నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి వచ్చే ఎన్నికల్లో మరో సారి పోటీకి రెడీ అవ్వాలని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఇటీవల జిల్లా పర్యటనలో ప్రకటించిన విషయం విధితమే. జిల్లాలో ఉన్న మొత్తం 12 స్థానాల్లో 6 నుంచి 7 నియోజకవర్గాల్లో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అభించే ఛాన్సులు ఉన్నాయి.జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరో సారి పోటీ చేయనున్నారు. ఇక్కడ పోటీ చేసేందుకు ఆశావాహులు ఉన్నా చంద్రబాబు మదిలో మాత్రం దామచర్ల జనార్దనే ఉన్నారు. జిల్లాలో టీడీపీని బలోపేతం చేయడంతో ఆయనపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఎంతో నమ్మకం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఒంగోలు సీటే కాకుండా జిల్లాలో మరి కొన్ని సీట్లు కూడా అభ్యర్థుల ఎంపికను జనార్దన్ ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ ప్రకాశంలో కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డిలకు తిరిగి దక్కనున్నాయి. వీరిద్దరూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరంగా సింగిల్ ఆప్షన్‌గా ఉన్నారు. నియోజకవర్గంలో వీరి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కూడా వీరికి టిక్కెట్ విషయంలో తిరుగు లేకుండా చేస్తోంది.పర్చూరులో ఏలూరు సాంబశివరావు సీటుకు ఎలాంటి డోకా లేదనిపిస్తోంది. టిక్కెట్ దక్కే లిస్టులో తొలి వరుసలోనే సాంబశివరావు ఉన్నట్లు సమాచారం. అద్దంకి సీటు విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ గత ఎన్నికల్లో ఓడిన కరణం వెంకటేశ్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నా... చంద్రబాబు గొట్టిపాటి రవికుమార్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సీటు విషయంలో చివరి వరకు తేల్చకపోయినా రవికి సీటు విషయంలో ఎలాంటి ఢోకా లేదు. చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ పార్టీలోనే కంటిన్యూ అయితే తిరిగి బీఫామ్ ఆయనకే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని అటున్నారు. దర్శిలో మంత్రి శిద్దా రాఘవరావు తిరిగి అసెంబ్లీకే పోటీ చేస్తే దర్శి సీటు శిద్దా ఫ్యామిలీకే దక్కుతుంది. ఒక వేళ శిద్దా నరసారావుపేట లోక్‌సభకు వెళ్తే, దర్శి సీటును కరణం బలరామ్ తనయుడు కరణం వెంకటేశ్‌కు ఇచ్చి శిద్దా రాఘవరావు తనయుడిని మార్కాపురం నుంచి కూడా పోటీ చేయించే ఆలోచనలో అధిష్టానం ఉందని రాజకీయవర్గాలు అంటున్నాయి.జిల్లాలో మూడు రిజర్వుడు నియోజకవర్గాలు అయిన ఎర్రగొండపా లెం, సంతనూతలపాడులో పార్టీ తీవ్ర గందరగోళంలో ఉంది. ఎర్రగొండ పాలెంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదని, అక్కడ పార్టీ చాలా బలహీనంగా ఉందని అంటున్నారు. సంతనూతలపాడులో సిట్టింగ్ ఇంచార్జి బీఎన్ విజయ్‌కుమార్ పై పార్టీ కేడర్ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు సీటు ఇస్తే తాము పార్టీకి పనిచేయబో మని నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయ కులు తెగేసి చెప్పడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఇక కొండపిలో సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా శ్రీబాలా వీరాంజనేయ స్వామిపై అధిష్టానానికి కొం త సానుకూల అభిప్రాయం ఉన్నా నియోజకవర్గంలో ఆయన్ను వ్యతిరేకిస్తో న్న వర్గం బలంగా మారింది. కొండపి సీటు విషయంలో చంద్రబాబు వీరితో పాటు ఆ నియోజకవర్గంలో పట్టున్న కీలక నాయకుల అభిప్రా యాన్ని పరిగణనలోకి తీసుకుంటే స్వామికి సీటు దక్కడం కష్టమేనని అంటున్నారు. కొండపి జనార్ధన్ సొంత నియోజకవర్గం కావడంతో ఆయన ప్రభావం ఎంతైనా ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.పశ్చిమ ప్రకాశంలో మరో నియోజకవర్గం అయిన కనిగిరిలో సిట్టింగ్ ఎమ్మల్యే కదిరి బాబురావుకు తిరిగి సీటు లభిస్తుందా..? లేదా అనేది ఇప్పు డు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు నివేదికల్లో ఆయనకు మైనస్ మార్కులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. పైగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా కనిగిరి సీటు మార్చాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించిన విషయం విదితమే. కదిరి బాబురావుకు బదులు గా మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కనిగిరి అసెంబ్లీ సీటు ఇస్తారని.. దీనిపై బాబు దాదాపు నిర్ణయానికి వచ్చేసారని తెలుస్తోంది. ఇక పశ్చిమ ప్రకాశంలో వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మార్కాపురంలో టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న కందుల నారాయణరెడ్డిని కొనసాగించడం సందేహంగానే ఉంది. అక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మరో కొత్త వ్యక్తి పోటీ చేస్తారంటున్నారు. ఏదేమైనా ప్రకాశం టీడీపీలో ఐదారు నియోజకవర్గాల్లో ఎవ్వరూ ఊహించని మార్పులు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.