18 రోజుల అనంతరం వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. గత ఏడాది నవంబరు 6వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమయింది. ఇప్పటికి 11 జిల్లాలు పూర్తి చేసి 12వ జిల్లా అయిన విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే గత నెల 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై కత్తితో హత్యాయత్నం జరగడంతో ఆయన వైద్యుల సూచన మేరకు 18 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ పాదయాత్ర చేయాలని వైద్యులు సూచించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగి 18 రోజులు గడుస్తున్నా ఆయన తనపై జరిగిన హత్యాయత్నానికి గల కారణాలు, దుండగుడు తన వద్దకు ఎలా వచ్చిందీ? ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ మంత్రులు చేసిన విమర్శలకు వేటీకి సమాధానం చెప్పలేదు. ఆయన 18 రోజులుగా మౌనం పాటిస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలో మక్కువ ప్రాంతంలో తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్న జగన్ దీనిపై ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తి కరంగా మారింది. ఆయన ప్రజల సమక్షంలోనే దీనిపై స్పందించే అవకాశముంది. జగన్ పై దాడి జరగడంతో ఏపీ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఏపీ పోలీసుల విచారణను తాను నమ్మనని చెప్పిన జగన్ వారికి స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో పోలీసులు జగన్ కు నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర సమయంలోనే జగన్ నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేసే యోచనలో ఏపీ పోలీసులు ఉన్నారు. జగన్ స్టేట్ మెంట్ ఇస్తే తప్ప కేసు నిలబడదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. హైకోర్టు కూడా ఏపీ పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వాలని సూచించడంతో జగన్ స్టేట్ మెంట్ ఇస్తారా? లేదా? అన్న ఆసక్తి కూడా నెలకొని ఉంది.జగన్ కు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మాత్రమే పాదయాత్రకు మిగలి ఉండటంతో ఈ జిల్లాలో మూడండచెల భద్రతను జగన్ కు కల్పిస్తున్నారు. జగన్ భుజానికి గాయ కావడం, తొమ్మిది కుట్లు పడటంతో ఆయన భుజానికి దగ్గరగా ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు రోప్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. జగన్ ప్రయివేటు సెక్యూరిటీని కూడా పెంచుకున్నారు. కేవలం అనుమతి ఉన్నవారినే జగన్ ను కలిసేందుకు అవకాశం కల్పిస్తామని పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద 18 రోజుల తర్వాత జగన్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కావడంతో పార్టీ శ్రేణులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నాయి.