YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియా

ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియా
ఫేస్‌బుక్… వాట్సాప్.. ట్విట్టర్.. ఇన్‌స్టాగ్రాం… పక్కనున్న మనిషి ఎవరన్నది మర్చిపోయి అదేపనిగా నిమిషానికోసారైనా వీటిని చూడకుండా ఉండలేరు. ప్రధానంగా యువతరం వీటికి బానిసగా మారింది. పలకరింపులు.. శుభాకాంక్షలు.. జ్ఞాపకాల షేరింగ్‌లతో ప్రారంభమైన సోషల్ మీడియా మోజు ఇప్పుడు ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్ధులపై దాడికి వేదిక అవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల వేళ పార్టీల విభాగాలు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారు.తమకు అనుకూల ప్రచారంతోపాటు ప్రత్యర్థులపైన నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యంగ్యమైన కామెంట్లతో రెచ్చగొట్టే ధోరణినీ ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ‘సామాజిక’ స్వేచ్చ కాస్తా.. ‘సోషల్’ వార్‌గా మారుతోంది. ఒకప్పుడు పార్టీల కార్యకర్తలు వీధుల్లో పడే గొడవలు కాస్తా ఇప్పుడు ఫేస్‌బుక్ పేజీల్లో జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా చేసే ప్రచారం, మీడియాలో ప్రకటనలతో పాటు సోషల్ మీడియాలో చేసే ప్రచారంపైనా తమ దృష్టి ఉంటుందని జిల్లా ల అధికారులు స్పష్టం చేస్తున్నారు.గోడరాతలు, ఫ్లెక్సీలు, మీడియా ప్రకటనలు, కటౌట్‌లు, సభలు, సమావేశాలు, ర్యాలీలు.. ఇవేవి అవసరం లేదు నెట్‌ఖర్చు తప్ప పెద్దగా ఖర్చు లేకుండానే లక్షల మందికి చేరవేయొచ్చు. మనుషులు, హంగు ఆర్భాటాలు అవసరం లేకుండా చెప్పదల్చుకున్న విషయాన్ని నేరుగా చెప్పెయొచ్చు. అదే సోషల్ మీడియాకున్న ప్లస్ పాయింట్. అందుకే చేతిలో సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దానికి బానిసలవుతున్నారు. ఇందులోనూ వ్యక్తిగత ప్రచారం కంటే వాట్సాప్‌గ్రూపులు, ఫేస్‌బుక్ పేజీల ద్వారా ఒకేసారి వందల మందికి చేరవేస్తున్నారు. ఇప్పుడు దీన్నే రాజకీయ పార్టీలు తమ ప్రధాన ప్రచార సాధనంగా వాడుకుంటున్నారు. తమ గురించి ఎలా ప్రచారం చేస్తే.. ఎక్కువ మంది లైక్, షేర్ చేస్తున్నారన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. ప్రత్యర్థులకు ఎలాంటి కామెంట్లు వస్తున్నాయి..తమ పరంగా ఎలాంటి కౌంటర్లు ఇవ్వాలనే వాటిని పరిశీలించేందుకు పలు పార్టీలు ఏకంగా సోషల్ మీడియా టీమ్‌లనే వేతనాలు ఇచ్చి మరీ నడిపిస్తున్నాయి. కామెంట్లు, కౌంటర్ల రేసులో తామే ముందుండాలన్న తపనతో తమ అభ్యర్ధి గుణగణాలు, ఎదుటివాళ్ల లోపాలను చెబుతూ పోస్టు పెడుతున్నారు. ‘ఐదేళ్ల కిందట ఇలా ఉండేది.. ఇప్పుడు ఇదిగో ఇలా మార్చాం, ఈ ఘనత మా అభ్యర్ధిదే, ఇలాంటివి ఎన్నో చేశాం. ఇకముందు మరెన్నో చేస్తాం. ఇప్పటికైనా అభివృద్ధి చేయూత నివ్వండి..’ అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై సంబంధిత పార్టీ అనుచరులు జయహో అంటుంటే, ప్రత్యర్ధులు మాత్రం వ్యతిరేక కామెంట్లు విసురుతున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా తటస్థంగా ఉండేవారు పెట్టే వ్యంగ్య పోస్టులూ పేలుతున్నాయి. ఆయా పార్టీలకు చురుక్కు చురుక్కు అనిపించేలా కూడా సోషల్ మీడియాలో కమెంట్లు మెరుస్తున్నాయి. ఈ నేపధ్యంలో విమర్శలకైనా.. ఆరోపణలకైనా.. ఒక హద్దు ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రత్యర్ధిపై దాడి చేసే ముందు సంబంధిత అంశానికి సంబంధించిన ఆధారం కూడా ఉండాలి. కానీ.. ఇవేవి పటించుకోకుండా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు చాలా మంది ఇష్టానుసారంగా కామెంట్లు, కౌంటర్లు పెడుతున్నారు. ముందస్తు ఎన్నికలు మొదలైనప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఈ ‘సోషల్’ వార్ రోజు రోజుకూ పెరుగుతోంది.

Related Posts