- రైతుల కన్నీళ్లు మంచివి కావు
- అవినీతి, అక్రమాలకు బహిరంగ విచారణకు సిద్ధమా?
- మీ అక్రమాలపై మేం చర్చకు సిద్ధం
- టీఆర్ఎస్‌కు సవాల్ విసిరిన టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క
వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేని, రైతులు ధైర్యంగా ఉండాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్డాడ్‌లో జరిగిన రైతు మద్దతు సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మద్దతు ధర కల్పించకుండా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాల్కొండ, ఆర్మూరులో పసుపు, ఎర్రజొన్న పండించే రైతులతో పాటు.. ఖమ్మంలో మిర్చి, వరంగల్‌లో పత్తి పండించే రైతులు పరిస్థితి ఇలాగే ఉందని ఆయన చెప్పారు. ముదనష్టపు నిర్ణయాలు తీసుకుంటున్న ఈ రాష్ట్ర పప్రభుత్వం రైతులను సర్వనాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదెక్కడి పాలన
గతంలో రైతు పక్షపాతి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. పసుపు ధర క్వింటాల్‌కు 10 వేల నుంచి 16 వేల రూపాయలుగా ఉండేది. అదే ఎర్రజొన్న విషయానికి వస్తే.. క్వింటాల్‌కు కనీస ధర 5 వేల రూపాయలు ఉండేది. కాంగరెస్ పాలనతో పసుపు రైతు సగటున ఎకరాకు 15 క్వింటాళ్ల పండిస్తే.. అతనికి సగటును లక్ష 50 వేల రూపాయల ఆదాయం లభించేది. అదే ఎర్రజొన్న విషయానికి వస్తే.. ఎకరాకు 15 క్వింటాళ్లకు సగటును 75 వేల రూపాయలు వచ్చేది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటు పసుపు, ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతు వేల రూపాయలు నష్టపోతుంటే.. ప్రభుత్వం మాత్రం ముందస్తు సాయం పేరుతో 4 వేలను ముష్టి వేస్తోందని మండిపడ్డారు. అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు.
రుణమాఫీ ఎక్కడ?
కేసీఆర్ ఎన్నికల సమయంలో పెట్టిన రుణమాణీ ఇంతవరకూ అమలు కాలేదు. లక్ష రూపాయల అప్పును నాలుగు విడతలుగా బ్యాంకులకు చెల్లిస్తామన్న ప్రభుత్వం రైతును నట్టేట ముంచుంది. ప్రభుత్వం బ్యాంకు వాయిదాను సరైన సమయంలో చెల్లించకపోవడంతో బ్యాంకులు రైతుకు కొత్త రుణాలు నిలిపాయి. దీంతో అన్నదాతలు బయట నుంచి వడ్డీలు తెచ్చి పంటలు వేశారని అన్నారు. బ్యాంకు అప్పు లక్ష, బయట రుణం మొత్తం రైతను నెత్తిన 3 లక్షల 45 వేలు రైతు నెత్తిన పడిందని చెప్పారు.
ఆర్మూర్ డిక్లరేషన్ అమలు చేస్తాం
2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. వెంటనే ఆర్మూర్ డిక్లరేషన్‌ను అమలు చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అందులో భాగంగా రైతుకు ఒకేసారి రెండు లక్షల రూపాయల పంటరుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. అంతేకాక పసుపు, ఎర్రజొన్న అమ్మకాలకు మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?
రైతులకు అందాల్సిన ట్రాక్టర్లను పార్టీ కార్యకర్తలకు పంచుతోందని భట్టి చెప్పారు. అలాగే.. రాష్ట్రంలోని నకిలీ విత్తన సంస్థలకు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, కేసీఆర్ లింకులు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంపై.. మేం అన్ని ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధం... మీరూ సిద్ధమా.. అని టీఆరెస్ నాయకులకు భట్టి సవాల్ విసిరారు.