ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ, తదితర కార్పొరేషన్ ల నిధులను పేదలకు వస్తురూపంలో అందించి వారిలో ఆర్థిక స్వాతంత్ర్యం పెంచి పేదరికంపై గెలవాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అని ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం అయన కాకినాడలో ఆనందభారతి మైదానంలో పేదరికంపై గెలుపు కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ సందర్బంగా అయన ఆదరణ 2 ద్వారా లబ్థిదారులకు పనిముట్లు పంపిణీ చేసారు. మంత్రి మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో పేదల్లో ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాలని బి.ఆర్ అంబేద్కర్, సామాజిక స్వాతంత్ర్యం కల్పించాలని మహాత్మా గాంధీ ఉద్యమాలు చేసినప్పటికీ వారందరి ఉద్దేశ్యం పేదలను అభివృద్ధి చేయడమేనని అన్నారు. ఈ సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.70 వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదరికంపై విజయం సాధించాలన్న లక్ష్యంతో ఈ ఏడాది బడ్జెట్లో బీసీలకు రూ.12 వేల కోట్లు, ఎస్సీలకు రూ.9 వేల కోట్లు, ఎస్టీలకు రూ.4 వేల కోట్లు కేటాయించడం జరిగింది. త్వరలోనే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.35 కోట్లు, ఈబీసీలకు రూ.100 కోట్లు కేటాయించి వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడాలన్నదే చంద్రబాబు ఉద్దేశ్యమని యనమల అన్నారు.