కార్తీకమాసం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో వనభోజనాల సందడి మొదలవుతుంది. కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆహ్లాదకరంగా సాగే వనభోజనాలు మన సంప్రదాయాలను చాటిచెబుతాయి. బంధువులు, స్నేహితులతో కలిసి చెట్ల నీడలో భోజనం చేయడానికి పెద్దలు ఈ వనభోజనాలను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ వనభోజనాలు రానురాను కుల భోజనాలుగా మారిపోయాయి. కుల సంఘాల పేరిట భారీ ఎత్తున వనభోజనాలను నిర్వహించడం సంప్రదాయంగా మారిపోయింది. దీనికి రాజకీయ పార్టీలు తోడవడంతో వనభోజనాలు కాస్త ‘కుల భోజనాలు’గా రూపాంతరం చెందే పరిస్థితి వచ్చేసింది. ఓ కుల సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలు జరిగితే అదే కులానికి చెందిన రాజకీయ నాయకులంతా అక్కడ వాలిపోతారు. అసలు కుల రాజకీయాల చర్చకు వన భోజనాలు వేదికలు అవుతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అయితే ఈ మచ్చ తన పార్టీకి అంటుకోకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ జాగ్రత్తపడుతున్నారు. అందుకే వనభోజనాల సమయం వచ్చేయడంతో సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల మహిళలకు కార్తీకమాసం శుభాకాంక్షలు తెలుపుతూనే తన పేరిట వనభోజనాలు ఏర్పాటుచేయొద్దని సూచించారు.‘జనసేన నాయకులందరికీ విన్నపం: కార్తీక మాసం వనభోజనాలు మీరు కావాలంటే వ్యకిగతంగా జరుపుకోండి. కానీ, నా పేరు మీద, జనసేన పార్టీ పేరు మీద జరపద్దని నా మనవి. ఆడపడుచులకు, అక్కాచెల్లెళ్లకు, తల్లులకు కార్తీకమాసం శుభాకాంక్షలు’ అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. పవన్ ట్వీట్లో కుల ప్రస్తావన లేకపోయినా ఆయన మాటల్లో అంతరార్థం అదే. కుల సంఘాల పేరిట వనభోజనాలు పెట్టి అక్కడ తన ఫొటోలు, జనసేన జెండాలు ఏర్పాటుచేస్తారని ముందే ఊహించిన జనసేనాని ముందుగానే సూచనలు చేశారు.