ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సినీ నటుడు జగపతి బాబు భేటీ కావడం సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. పాతికేళ్ల సినీ ప్రయాణంలో సుమారు 120 చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్నారు జగపతి బాబు. హీరో నుండి విలన్‌గా టర్న్ తీసుకున్న జగపతి బాబు.. తెలుగు, తమిళ, మళయాల కన్నడ భాషల్లో దర్శకులకు ప్రతి నాయకుడిగా బెస్ట్ ఆప్షన్ అయ్యారు. తెలుగులో లెజెండ్, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో విలన్‌గా నటించి హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ రాబడుతూ క్రేజీ నటుడిగా మారారు జగపతి బాబు. ఆయన విలనిజానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ తరుణంలో జగపతిబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఏపీ సచివాలయం అమరావతిలో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని.. వ్యాపార సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించేందుకు జగపతి బాబు వచ్చినట్టు తెలుస్తోంది.