ఆదరణ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. పథకంలో భాగంగా.. చేతి వృత్తుల వారికి పరికరాలు, రుణాలు మంజూరు చేశారు. సోమవారం విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంపై విమర్శనాస్త్రాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్‌గా ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చారు.విజయసాయి తన ట్వీట్‌లో.. ‘రెయిన్ గన్ పట్టుకుని సీమలో కరువు కంటికి కనిపించకుండా తరిమికొట్టాడు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్ చేశాడు. తుఫాన్లను ఒంటి చేత్తో ఆపేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడుబాబు’అంటూ ఎద్దేవా చేశారు.మరో ట్వీట్‌లో.. ‘కుల వృత్తులలో మెజారిటీ బీసీలే. వారి కోసం వైఎస్ ప్రారంభించిన ఉచిత విద్య పథకాన్ని అటకెక్కించి. గతంలో పచ్చచొక్కాల జేబులు నింపిన ఆదరణ పథకానికి బూజు దులిపి కుల వృత్తుల వారికి పనిముట్ల పంపిణీతో పేదరికంపై గెలిచేశామంటూ ప్రచారం మొదలెట్టాడు... ప్రలోభాలకు ఆదిగురువైన చంద్రబాబు’అంటూ విమర్శించారు.