YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వేడెక్కుతున్న గుంటూరు రాజకీయాలు

వేడెక్కుతున్న గుంటూరు రాజకీయాలు
గుంటూరు జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఒకవైపు..అధికార టిడిపిలో గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు మళ్లీ టిక్కెట్‌ సంపాదించుకోవడానికి నానా తంటాలు పడుతుండగా…ప్రతిపక్ష వైకాపాలోనూ అదే పరిస్థితి నెలకొని ఉంది. గతంలో వైకాపా తరుపున గెలిచిన వారిలో ఇద్దరికి తప్ప మిగతా ముగ్గురికి టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి లేదు. దీనిపై ఆ పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే…గత ఎన్నికల్లో…తిరుగులేని విధంగా గెలిచిన టిడిపి..ఇప్పుడు అదే స్థాయిలో గెల్చేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ముఖ్యంగా పలువురి ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉండడంతో పార్టీ మళ్లీ ఆ స్థాయిలో విజయాలుసాధించగలుగుతుందా..? అనే అనుమానాలు స్వంత పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల్లోనే వ్యక్తం అవుతోంది.గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలు ఉంటే…12స్థానాలను టిడిపి గెలుచుకుని సత్తా చాటింది. ఐదు స్థానాలు వైకాపాకు దక్కగా..వాటిలో ఒక స్థానం పన్నెండు ఓట్లతో గెలుపొందింది. ఇది గత ఎన్నికల పరిస్థితి కాకా..ఇప్పుడు..టిడిపికి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మళ్లీ గెలుస్తారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఎన్నికల్లో టిడిపి వినుకొండ, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, తెనాలి, వేమూరు, తాడికొండ, పత్తిపాడు, రేపల్లె, గుంటూరు-2,పొన్నూరు నియోజక వర్గాల్లో విజయం సాధించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ స్థానాలను నిలబెట్టుకుంటుదా..? అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడం కష్టమే. నియోజకవర్గాల వారీగా ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితిని పరిశీలిద్దాం:
వినుకొండ: ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు గోనుగుంట్ల ఆంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వరుసుగా రెండు సార్లు ఇక్కడ నుంచి గెలుపొందినా…ప్రజల్లో పట్టుసాధించలేకపోయారనే మాట వినిపిస్తోంది. వ్యక్తిగతంగా మంచివాడనే పేరున్నా… నియోజకవర్గస్థాయిలో ప్రజలకు మేలు జరిగే పనులు చేయలేదనే మాట వినిపిస్తోంది. అంతే కాకుండా ఆయన అనుచరులు బరితెగించి…అవినీతికి పాల్పడ్డారనే పేరు..నియోజకవర్గంలో మారుమ్రోగుతోంది. అదే కాదు..ఆయన వ్యక్తిగత సహాయకుల మాటలకు లోబడతారని..వారు చెప్పిందే ఆయనకు వేదమని, వారిని నమ్ముకుని నిజమైన కార్యకర్తలను దూరం పెట్టారు. దీంతో..సునాయాసంగా గెలవాల్సిన ఇక్కడ ఆయన చెమటోడుస్తున్నారు. అయితే..ప్రత్యర్థి బలహీనం కావడంతో..మళ్లీ ఆయనే గెలవవచ్చు.
గురజాల: ప్రస్తుత శాసనసభ్యుడు ‘యరపతినేని శ్రీనివాసరావు’కు ప్రజల్లో మంచిపేరే ఉంది. అయితే…నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని…ప్రతిపక్షాలు ఈ మధ్య నానా రాద్ధాంతం చేశాయి. దీనిపై హైకోర్టులో కేసు కూడా నమోదు అయింది. దీనితో ఈయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే…నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారని పేరు సంపాదించుకోవడంతో..ఆయన గెలుస్తారనే మాట సర్వత్రా వినిపిస్తోంది.
సత్తెనపల్లి: ఇక్కడ నుంచి సీనియర్‌ నాయకుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలుపొందారు. అయితే..అప్పటి నుంచి..ఆయన నియోజకవర్గంలో భారీ ఎత్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. సుమారు వెయ్యికోట్లు రూపాయలు..ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చుచేశారు. అయితే ఆయన ఎన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినా..నియోజకవర్గంలో ఆయన కుమారుని వ్యవహారాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంతే కాకుండా వైశ్య సామాజికవర్గానికి చెందిన వారు..’కోడెల’ పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారని, దానితో పాటు…సహజంగానే..టిడిపిని వ్యతిరేకించే ‘జగన్‌’ సామాజికవర్గం బలంగా ఉండడంతో..ఇక్కడ ‘కోడెల’ గెలుపు అంత సులువు కాదు. కాగా ‘కోడెల’ ప్రత్యర్థి మళ్లీ ‘అంబటి రాంబాబు’ అయితే…’కోడెల’ సునాయాసంగా గెలుస్తారనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా..ఇక్కడ ఎవరు గెలిచినా..స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుస్తారు.
పెదకూరపాడు: సీనియర్‌ శాసనసభ్యుడు ‘కొమ్మాలపాటి శ్రీధర్‌’ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్రమ ఇసుక దందాలోనూ, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు, ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అంతే కాకుండా… నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించారనే విమర్శ ఉంది. అంతే కాకుండా స్వంత సామాజికవర్గంలో.. పెదకమ్మ, చినకమ్మ అంటూ చిచ్చు పెట్టారనే మాట కూడా ఉంది. అక్రమ ఇసుకలో వందల కోట్లు సంపాదించారనే విమర్శలు ఉన్నాయి. ఆయనతో పాటు..ఆయన వ్యక్తిగత సహాయకులు కూడా భారీగా సంపద పోగేసుకున్నారే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే..ఇవేవీ ఆయన గెలుపుకు అవరోధం కాదనే మాట నియోజకవర్గంలో వ్యక్తం అవుతోంది. వైకాపాకు బలహీనమైన అభ్యర్థి ఉన్నారని..దాంతో…’కొమ్మాలపాటి’ సునాయాసంగా గెలుస్తారనే టిడిపి నాయకులు,సానుభూతిపరులు, ఇతర వర్గాల ప్రజలు చెబుతున్నారు. ఎంత అవినీతి చేసినా, అక్రమాలకు పాల్పడ్డా..ఇక్కడ…’కొమ్మాలపాటి’ గెలుస్తారనే మాట ఎక్కువ మంది ప్రజల నుంచి వినిపిస్తోంది.
చిలకలూరిపేట: మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన శాఖల్లో పనిచేసిన ఆయనకు జిల్లా వ్యాప్తంగా పేరు ఉన్నా లేకున్నా..నియోజకవర్గంలో మాత్రం తిరుగులేని పట్టుసాధించారు. జిల్లా మంత్రిగా…జిల్లా అంతా చూసుకోవాల్సిన ‘పత్తిపాటి’ తన స్వంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇక్కడ నుంచి మళ్లీ ఆయన గెలవడం..సునాయాసమే. ఇటీవల కాలంలో వైకాపా తన అభ్యర్థిని మార్చి..మహిళను రంగంలోకి దింపింది. ఆమె నాలుగు రోజులు హడావుడి చేసి..ఇప్పుడు..మౌనవ్రతం పాటిస్తోంది. ఆమెను నమ్ముకుంటే..అయ్యేదేమీ లేదని..ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో…ఇక్కడ ‘పుల్లారావు’ గెలుపును ఎవరూ ఆపలేరనేది నిజమే..!
తెనాలి: త్రిముఖ పోటీ ఖాయమైన ఈ నియోజకవర్గంలో…అధికార టిడిపిని నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్లీ ఇక్కడ నుంచి ఆయన గెలుస్తారా..? అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ వైకాపా, జనసేన, టిడిపిలు బలంగా పోటీ పడుతున్నాయి. ఎమ్మెల్యేగా ‘ఆలపాటి’ ప్రజలకు దగ్గరగా ఉన్నా..ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా మారాయి. దీంతో..ఆయన నియోజకవర్గం మారాలనే ఆలోచనతో ఉన్నారు. మరి చంద్రబాబు దానికి అనుమతి ఇస్తారో..లేదో కానీ..ఇక్కడ నుండి..ఆయన గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
వేమూరు: ఎస్సీ నియోజకవర్గమైన వేమూరు నుంచి మంత్రి నక్కా ఆనంద్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు సార్లు ఇక్కడ నుంచి గెలిచిన ఆయన నియోజకవర్గంపై పట్టుసాధించలేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. వైకాపాకు చెందిన ఓటర్లు అధికంగా ఉన్న చోట..మంత్రి సరిగాపనిచేయలేదు. దీంతో..నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా..ఆయన ఓటమి చెందుతారనే మాట నియోజకవర్గ ఓటర్ల నుంచి వినిపిస్తోంది.
తాడికొండ: మరో ఎస్సీ నియోజకవర్గమైన తాడికొండ నుంచి శ్రావణ్‌కుమార్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటిసారిగా గెలిచిన ఆయన నియోజకవర్గ టిడిపి నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతిపరులకు దూరమయ్యారనే మాట వినిపిస్తోంది. ‘చంద్రబాబు’ సామాజికవర్గానికి చెందిన నాయకులను, కార్యకర్తలను, సానుభూతిపరులను ఆయన దూరం చేసుకున్నారు. ఆయనకు మళ్లీ టిక్కెట్‌ ఇస్తే..ఓడిస్తామని..వారు బహిరంగంగానే సవాళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మళ్లీ టిక్కెట్‌ ఇస్తే..ఇక్కడ టిడిపికి పరాజయం తప్పదనేమాట ఓటర్ల నుంచి వ్యక్తం అవుతోంది.
పత్తిపాడు: మాజీ మంత్రి ‘రావెల కిశోర్‌బాబు’ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడ…టిడిపికి ఆదరణ ఉన్నా…ఎమ్మెల్యే ‘రావెల’పై మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మళ్లీ ఇక్కడ నుంచి ఆయనకు సీటు ఇస్తే..టిడిపి ఓడిపోయే మొదటి సీటు ఇదేననే మాట స్వంత పార్టీ నాయకుల నుంచే వస్తోంది. అయితే..ఇక్కడ టిక్కెట్‌ వేరే వారికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
రేపల్లె: బీసీ సామాజికవర్గానికి చెందిన ‘అనగాని సత్యప్రసాద్‌’కు ఇక్కడ గడ్డుపరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో ఒక పత్రిక ఆయన మళ్లీ 75శాతం ఓట్లతో గెలుపొందుతారనే వార్తలు ప్రసారం చేయడంతో..ఇక తనకు తిరుగులేదని..ఆయన భావిస్తు న్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదనే విషయాన్ని ఆయన పట్టించుకోకుండా గాలిలో మేడలు కడుతున్నారని..స్వంత సామాజికవర్గంలోని కొందరు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..అవేమీ పట్టనట్లు..అంతా బాగున్నట్లు ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో బలమైన ‘చంద్రబాబు’ సామాజికవర్గ నేతలు..ఆయనకు దూరం జరుగుతుండడం..ఆయనకు మైనస్‌ కాబోతోంది. మొత్తం మీద..ఇక్కడ గట్టిపోటీ ఉండబోతోంది.
గుంటూరు-2: మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆయన విఫలమయ్యారని.. నియోజకవర్గంలోని ఎక్కువ మంది ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఎటువంటిఅభివృద్ధి పనులు జరగలేదని..ఆయనకు మరోసారి సీటు ఇస్తే..ఓడించడం ఖాయమనే మాట వారి నుంచి వస్తోంది. మొత్తం మీద..ఇక్కడ నుంచి ఆయనకు మరోసారి సీటు ఇస్తే..ఆయన ఓటమి ఖాయం.పొన్నూరు: ఐదుసార్లు వరుసగా గెలిచి…ఆరవసారి రంగంలో ఉన్న సీనియర్‌ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర ఇప్పుడు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారనే మాట నియోజకవర్గ ఓటర్ల నుంచి వ్యక్తం అవుతోంది. సీనియర్‌ను అయిన తనకు మంత్రి పదవి ఇవ్వలేదని..ఆయన చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా..ఆయనను ‘బాబు’పట్టించుకోలేదు. సరికదా..వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వాలా..? వద్దా…అని చర్చిస్తున్నారు. వరుసగా ఐదుసార్లు గెలిచిన..ఆయనపై నియోజకవర్గంలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఈయన ప్రత్యర్థికి అంత మంచి పేరు లేకపోవడంతో..మరోసారి ‘నరేంద్ర’ గెలుస్తారని కొంత మంది చెబుతుండగా..అంత సులువు కాదని మరి కొందరు పేర్కొంటున్నారు. మొత్తం మీద..ఇక్కడ హోరాహోరి పోరు ఉంటుందని మాత్రం స్పష్టమైంది.ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘నర్సరావుపేట,మాచర్ల,బాపట్ల, గుంటూరు-1, మంగళగిరి’ల్లో ఆ పార్టీకి కూడా అంత సానుకూల పవనాలు లేవు. నర్సరావుపేట, బాపట్లల్లో ఆ పార్టీకి కొంత అనుకూలత ఉంది. ఇక మంగళగిరిలో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయం. గుంటూరు-1, మాచర్లల్లో టిడిపి సరైన అభ్యర్థులను పెట్టగలిగితే…టిడిపి సునాయాసంగా గెలుస్తుందనే మెజార్టీ ఓటర్లు చెబుతున్నారు. మరి…టిడిపి అధిష్టానం సరైన, గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపితేనే…గతంలో సాధించిన విజయాలను పునరావృతం చేయగలుగుతుంది. లేదంటే…పరిస్థితి తలకిందులు కావడం ఖాయం. ఇప్పటికిప్పుడు అంచనా వేయాలంటే…అధికార టిడిపి 4 స్థానాల్లో గెలిచే పరిస్థితుల్లో ఉండగా….వైకాపాకు నాలుగు స్థానాల్లో గెలిచే పరిస్థితి ఉంది. మరో తొమ్మిది స్థానాల్లో హోరాహోరి పోరు ఉంటుందని స్పష్టం అవుతోంది

Related Posts