శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలు ప్రవేశంఫై వచ్చే ఏడాది జనవరి 22న బహిరంగ కోర్టులో నిర్వహిస్తామని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలు ప్రవేశించవచ్చంటూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ బుధవారం మరో పిటిషన్ దాఖలైంది. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ పిటిషన్‌ను పరిశీలించారు. దయచేసి జనవరి 22 వరకు వేచి ఉండాల్సిందిగా సీజేఐ పిటిషనర్‌కు సూచించారు. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన 49 రివ్యూ పిటిషన్ల విచారణను వచ్చే ఏడాది జనవరి 22న బహిరంగ కోర్టులో నిర్వహిస్తామని సీజేఐ తెలిపారు. గతంలో వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.మకరవిళక్కు సీజన్ సందర్భంగా దీక్ష తీసుకున్న భక్తులు వాటిని విరమించుకునేందుకు శబరిమలకు పోటెత్తుతారు. ఈనెల 17 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే శబరిమల ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తున్న తనకు భద్రత కల్పించాల్సిందిగా ప్రముఖ సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కోరారు. నవంబరు 17న ఆమె శబరిమలను దర్శించుకునేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత మూడోసారి ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అయితే.. గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వకపోవడంతో శబరిమలను దర్శించుకునేందుకు తాము సిద్ధపడుతున్నామని కొందరు మహిళా భక్తులు ప్రకటించారు.