రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విశాఖ మన్యంలోని తెలుగు తమ్ముళ్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ ప్రాంతానికి చెందిన కిడారి శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడమే వీరి అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గిరిజన ప్రాంతానికి చెందిన చాలామంది నాయకులు వ్యతిరేకిస్తూ లోలోపలే అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే తమ అభిప్రాయాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట చెప్పే సాహసం చేయలేక ఎవరికి వారే వౌనం దాల్చాల్సిన పరిస్థితి ఈ ప్రాంత తెలుగు తమ్ముళ్లకు ఏర్పడింది. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్‌కుమార్‌ను మంత్రి వర్గంలోకి తీసుకున్న తీరును నాయకగణం తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయం అంటేనే ఏమిటో తెలియని శ్రావణ్‌కుమార్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడమే కాకుండా ఏకంగా రెండు ప్రధాన శాఖలను అప్పగించడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న నాయకులు ఎంతో మంది ఉండగా తమందరినీ కాదని కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని శ్రావణ్‌కుమార్‌ను మంత్రిగా ఏలా నియమిస్తారని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. తన తండ్రిని మావోయిస్టులు హత్య చేసారన్న సానుభూతితో తనయుడిని మంత్రివర్గంలో నియమించి గిరిజన ప్రాంతంలో పార్టీని పటిష్టపరచుకోవాలని ముఖ్యమంత్రి భావించడం ఏమాత్రం సరికాదని వారు అంటున్నారు. మంత్రివర్గంలోకి శ్రావణ్‌కుమార్‌ను తీసుకోవడం ద్వారా మన్యంలో పార్టీ ఏలా బలోపేతవౌతుందని, దీనివలన గిరిజన ప్రజానీకంలో పార్టీ ప్రభావం ఎందుకు పెరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. మంత్రిగా నియమితులైన శ్రావణ్‌కుమార్‌కు ఆయన అనుచరులకు మాత్రమే దీనివలన లబ్ధి చేకూరుతుందే తప్ప గిరిజనులకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. దశబ్ధాల కాలంగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తూ ప్రజాధరణ కలిగిన నాయకులకు మంత్రి పదవి ఇవ్వడం వలన పార్టీ పటిష్టతకు దోహదపడుతుందే తప్ప రాజకీయం తెలియని, ప్రజలకు పరిచయం లేని శ్రావణ్‌కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వడం వలన అదనంగా కలిసొచ్చే ప్రయోజనం ఏదీ లేదని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వలన ఇంతకాలం పార్టీ కోసం అంతోకొంతో పనిచేస్తున్న వారంతా నిస్తేజులుగా మారాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. అంతేకాకుండా ఇంతవరకు పార్టీకి ఏమాత్రం సంబంధం లేని, నిన్న మొన్నటి వరకు తమలో చాలామందికే తెలియని శ్రావణ్‌కుమార్ ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వలన సుదీర్ఖకాలం పాటు పార్టీకి సేవలు అందించిన తామంతా ఏమైపోవాలని తెలుగుతమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. ఇదిలాఉండగా మంత్రిగా శ్రావణ్‌కుమార్ నియమితులు కానున్నట్టు తెలుసుకున్న దేశం నాయకులలో కొంతమంది మంత్రివర్గ విస్తరణకు ముందే జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి తమ ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదని, దీనివలన భవిష్యత్తులో తాము ప్రశాంతంగా పనిచేయలేమని తెలుగు తమ్ముళ్లు గంటా సమక్షంలో తమ గోడు విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. అయితే మన్యానికి చెందిన దేశం నాయకులు ఆవేదనను విన్న మంత్రి గంటా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఏలా కాదనగలమని ప్రశ్నించినట్టు తెలిసింది. మంత్రిగా శ్రావణ్‌ను తీసుకోవడంలో మంచి చెడులను పక్కన పెడితే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించి మాట్లాడడం మంచిదికాదని చెప్పినట్టు సమాచారం. దీంతో తెలుగుతమ్ముళ్లు చేసేదేమి లేక వౌనం దాల్చినప్పటికీ ఈ ప్రాంత నాయకులలో చాలామందికి శ్రావణ్‌కుమార్‌ను మంత్రిగా నియమించడం ఏమాత్రం రుచించడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మన్యం రాజకీయాలు రానున్న రోజుల్లో మరింత రసవత్తరంగా మారే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు.