రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన వాస్తవాలను బహిర్గతం చేస్తేనే వాటి ధరల గురించి చర్చ సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. రఫేల్ కేసులో బుధవారం విచారణ జరుగుతుండగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రఫేల్ యుద్ధ విమానాల ధరల వివరాలు ప్రజలకు బహిర్గతం చెయ్యాలా.. వద్దా అనే దానిపై ఇప్పుడు మేము నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ప్రజల ముందుకు వాస్తవాలు తీసుకురానప్పుడు.. దానిపై చర్చ అన్న ప్రశ్నకే తావు లేదు అని పేర్కొంది.36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం గురించి విచారణ జరిపేందుకు వైమానిక దళ అధికారులు కోర్టుకు రావాలని ధర్మాసనం ఆదేశించింది. వైమానిక దళం అవసరాల గురించి చర్చిస్తున్న నేపథ్యంలో రఫేల్ విమానాల గురించి వైమానిక దళ అధికారులను ప్రశ్నించాలనుకుంటున్నట్లు కోర్టు వెల్లడించింది. రక్షణ శాఖ అధికారుల నుంచి కాకుండా వైమానిక దళ అధికారుల నుంచి సమాధానాలు వినాలనుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో వైమానిక దళ అధికారి కొన్ని నిమిషాల్లో కోర్టుకు చేరుకుంటారని అటార్నీ జనరల్ వేణుగోపాల్ న్యాయస్థానానికి తెలిపారు. ధరల వివరాలు రహస్యంగా ఉండాలని లేదంటే శత్రువులు లాభం పొందుతారని కేంద్ర తరఫున వాదించిన వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ధరల వివరాలు నిపుణులు పరిశీలించాల్సిన అంశమని, పార్లమెంటులో కూడా యుద్ధ విమానాల ధరల గురించి పూర్తి వివరాలు ఇవ్వలేదని కోర్టులో వెల్లడించారు. భారత ప్రభుత్వం 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.58వేల కోట్ల విలువైన ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే.