ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ గమ్యం ఎటువైపు బీజేపీ యేతర పార్టీలన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చి 2019 ఎన్నికలను ఎదుర్కోవాలన్న ధ్యేయంతో ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు. ఈ నెల 22న దిల్లీలో మహాకూటమి నేతలంతా ఒకేచోట సమావేశమయ్యేలా ఆయన ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడి హస్తినలో ఏర్పాటయ్యే సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించారు. వీరిద్దరూ మంచిమిత్రులు.బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము సమానదూరంలో ఉంటానని, భవిష్యత్తులో ఇదే పంథా కొనసాగిస్తానని, అదే బిజద లక్ష్యమని ఆయన పునరుద్ఘాటిస్తూ వచ్చారు. జీఎస్‌టీ, నోట్ల రద్దు తదితర నిర్ణయాలు, కీలక బిల్లులు బీజేపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయాల్లో నవీన్ మద్దతుగా నిలిచారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏ పక్షాన ఉన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని కేంద్ర రాజకీయాల పట్ల ఆసక్తి లేదని పలుసార్లు పేర్కొన్న నవీన్ చంద్రబాబు అభ్యర్థన మన్నిస్తారా? అన్నదిప్పుడు చర్చనీయంగా ఉంది.సీనియర్ మంత్రి, బిజద ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ పాత్ర్ మంగళవారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు, నవీన్ ఏం మాట్లాడుకున్నారన్నది తమకు తెలియదని చెప్పారు. కాంగ్రెస్, బీజూపీలకు సమానదూరమన్నది తమ పార్టీ విధానమని, 22న ముఖ్యమంత్రి దిల్లీ వెళతారా ! అన్నదానిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత శ్రీకాంత్ జెనా మాట్లాడుతూ నవీన్ అంతర్యం ఎవరికీ బోధపడదని, ఆయన పక్కా అవకాశవాది అని అభివర్ణించారు. స్వీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసే ఆయనకు భాజపాతో లోపాయికారీ సంబంధాలున్నాయని చెప్పారు